తీవ్ర అనారోగ్యంతో ఢాకా ఆస్పత్రిలో కన్నుమూసిన బీఎన్పీ అధినేత్రి
పదేళ్లపాటు దేశాన్ని పరిపాలించిన నేత
దేశ తొలి మహిళా ప్రధానిగా రికార్డ్
ఢాకా/న్యూఢిల్లీ/బీజింగ్: మూడుసార్లు ప్రధానమంత్రి పీఠం కూర్చుని దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన దిగ్గజ నాయకురాలు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పి) అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారని బీఎన్పీ ప్రధాన కార్యదర్శి మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగిర్ చెప్పారు. 80 ఏళ్ల జియాను వృద్ధాప్య సమస్యలతోపాటు పలు దీర్ఘకాలిక వ్యాధులు కుంగదీశాయి.ఛాతిలో ఇన్ఫెక్షన్ రావడంతో తొలుత నవంబర్ 23వ తేదీన ఆమెను ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు.
నవంబర్ 27వ తేదీన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కరోనరీ కేర్ యూనిట్(సీసీయూ)లో చేరి్పంచి ప్రత్యేక వైద్యం ఆరంభించారు. కాలేయం, మూత్రపిండాలు, హృద్రోగ సమస్యలు, అత్యధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇలా పలు సమస్యలు చుట్టుముట్టంతో ఆమె ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. చివరిసారిగా ఆమె నవంబర్ 21వ తేదీన ఢాకా కంటోన్మెంట్‌లోని సాయుధబలగాల కార్యక్రమంలో బహిరంగంగా కనిపించారు. జియా చనిపోయినప్పుడు ఆమె పక్కనే జియా కుమారుడు తారిఖ్ రెహ్మిన్, కోడలు జుబైదా, మనవరాలు జైమా ఉన్నారు.
భర్త సమాధి పక్కనే ఖననం..
పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడిన మాజీ బంగ్లా అధ్యక్షుడు, బీఎన్పీ వ్యవస్థాపకుడు జియాఉర్ రెహ్మాన్ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేయనున్నారు. ఢాకాలోని షేర్–ఇ–బంగ్లా నగర్‌లోని జియా ఉద్యాన్‌లోని రెహ్మాన్ సమాధి వద్దే అధికార లాంఛనాలతో ఖనన క్రతువును పూర్తిచేయాలని ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. జియా మృతి నేపథ్యంలో దేశంలో మూడ్రోజులపాటు సంతాప దినాలను, అంత్యక్రియల ప్రార్థనల కోసం అదనంగా మరోరోజు సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అంత్యక్రియల కార్యక్రమంలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొననున్నారు.
పూడ్చలేని లోటుగా అభివర్ణించిన హసీనా
వైరి పార్టీ అవామీ లీగ్ సారథి షేక్ హసీనా సైతం జియా మరణంపై స్పందించారు. ‘‘బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా మాత్రమే కాదు సంక్షుభిత బంగ్లాలో సమస్యల పరిష్కారానికి జియా ఎంతగానో కృషిచేశారు. దేశానికి ఆమె చేసిన సేవ ఎన్నదగింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె లేని లోటును ఎవరూ పూడ్చలేరు’’అని హసీనా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య మజిలీలో జియా ఒక రక్షకురాలిగా నిలబడ్డారు. జియా మరణంతో బంగ్లాదేశ చరిత్రలో ఒక శకం ముగిసినట్లయింది అని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనుస్ జాతినుద్దేశించి ప్రసంగించారు. జియా మరణంతో ప్రపంచదేశాధినేతల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి.
దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన ప్రధాని మోదీ
ఖలీదా జియా మరణంపై భారత ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.
వివాదాలు, ప్రశంసలమయం
జియా వ్యక్తిగత, రాజకీయ ప్రస్తానం ఆద్యంతం ఆసక్తికరంగా, వివాదాస్పద నిర్ణయాలు, పాలన, ప్రశంసలతో సాగింది. భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడాది ముందు అంటే అవిభాజ్య భారతదేశంలో 1946 ఆగస్ట్ 15న నాటి బెంగాల్‌లోని దినాజ్‌పూర్ జిల్లాలో జియా జన్మించారు. తండ్రి ఇస్కందర్ మజూందార్, తల్లి తయ్యబా జల్పాయ్‌గురిలో టీ వ్యాపారం చేసేవారు. తర్వాత వీళ్ల కుటుంబం తూర్పు పాకిస్తాన్‌వైపు వలసవెళ్లింది. అంతకుముందు ఈమె సురేంద్రనాథ్ కాలేజీలో చదువుకున్నారు. ఒకప్పుటి పాకిస్తాన్ సైనిక జనరల్ జియాఉర్ రెహ్మిన్‌ను 1960లో పెళ్లాడారు.
1978లో రెహ్మాన్ బీఎన్పీ పార్టీని స్థాపించాక తొలిసారిగా ఈమె గురించి అప్పట్లో వార్తలొచ్చాయి. 1981 మే 30న నాటి సైన్యంలోని ఒక వర్గం రెహ్మాన్‌ను హత్యచేయడంతో 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో పార్టీ బాధ్యతలు ఈమె మోయాల్సి వచ్చింది. 1984 మేలో పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1982లో నాటి ఆర్మీ చీఫ్ జనరల్ హెచ్‌ఎం ఎర్షాద్ తిరుగుబాటులేవదీసి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ఈమె పెద్ద ఉద్యమంలేవదీశారు. దీంతో జాతీయస్థాయి నేతగా అవతరించారు.
1991లో చీఫ్ జస్టిస్ షహాబుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించగా బీఎన్పీ పార్టీ ఘనవిజయం సాధించింది. దీంతో తొలి మహిళా ప్రధానిగా ఈమె బాధ్యతలు స్వీకరించి రికార్డ్ సృష్టించారు. పాకిస్తాన్‌లో బెనజీర్ భుట్టో తర్వాత ఒక ఇస్లామిక్ దేశానికి ప్రధాని అయిన రెండో మహిళగానూ జియా చరిత్ర సృష్టించారు. 1996 ఎన్నికల్లోనూ జియా పార్టీ గెలిచినా షేక్‌హసీనా సారథ్యంలోని ఆవామీ లీగ్ చేసిన ఉద్యమాలతో కేవలం 12 రోజుల్లో జియా అధికారాన్ని కోల్పోయారు. అప్పుడే ఈమె తొలిసారిగా దేశంలో తాత్కాలిక ప్రభుత్వ విధానం తెచ్చారు.
2001లోనూ అధికారంలోకి వచ్చారు. 2006లో గద్దె దిగి తాత్కాలిక సర్కార్‌కు పగ్గాలు అప్పజెప్పారు. ఏడాదికే ఆమెపై అవినీతి ఆరోపణలు చేసి తర్వాతి ప్రభుత్వం జియాను అరెస్ట్‌చేసింది. ‘జియా అనాథల ట్రస్ట్’కేసులో జియాకు 2018 ఫిబ్రవరిలో ఐదేళ్ల జైలుశిక్ష పడింది. 2024లో హసీనా అధికారంలోకి రాగానే జియాకు క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదలయ్యారు.


