మత విద్వేషానికి తావులేదు: తారిఖ్
ఢాకా: ‘బంగ్లాదేశ్ ను సురక్షిత దేశంగా మార్చుకుందాం. స్వేచ్ఛాయుత, ప్రగతికాముక ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దుదాం‘ అని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎంపీ) తాత్కాలిక చైర్మన్ తారిఖ్ రెహ్మాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశవాసులంతా కలసికట్టుగా ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా యువత దేశ పునరి్నర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. దేశ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా కుమారుడైన తారిఖ్ 17 ఏళ్ల లండన్ ప్రవాసం నుంచి గురువారం తిరిగొచ్చారు.
విమానాశ్రయం నుంచి నేరుగా తన రాక కోసం భారీగా గుమిగూడిన మద్దతుదారులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల వద్దకు వెళ్లారు. వారినుద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పార్టీలు, మతాల విభేదాలకు అతీతంగా దేశ వికాసానికి పనిచేద్దాం. బంగ్లాదేశ్ ముస్లింలతో పాటు హిందువులు, సిక్కులు, క్రైస్తవులు అందరిదీ. మత విద్వేషానికి మన దేశంలో చోటు లేదు. కులమతాలు, వర్గాలకు అతీతంగా ప్రజలంతా హాయిగా జీవించే సురక్షిత బంగ్లాయే మన లక్ష్యం. ఇందుకోసం నా దగ్గర ప్రణాళిక
ఉంది‘ అంటూ అమెరికా హక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ నినాదాన్ని తలపించే వ్యాఖ్యలు చేశారు. దాని అమలుకు మీ అందరి మద్దతు కావాలి‘ అన్నారు.


