రాడికల్ లీడర్ షరీఫ్ ఒస్మాన్ హదీ హత్య.. తదనంతర చోటుచేసుకున్న పరిణామాలతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం రాజధాని ఢాకాలో జరిగిన పెట్రోల్ బాంబ్ దాడిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ పరిణామాల నడుమే.. తారిక్ రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) తాత్కాలిక ఛైర్మన్ తారిక్ రెహమాన్ (60) గురువారం స్వదేశంలో అడుగుపెట్టబోతున్నాడు. దాదాపు 17 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి. సుమారు 50 లక్షల మంది ఈ గ్రాండ్ వెల్‌కమ్‌లో పాల్గొంటారని అంచనా వేస్తోంది ఆ పార్టీ. మరోవైపు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
అంతకుముందు.. లండన్ హీథ్రో ఎయిర్‌పోర్ట్ నుంచి తారిక్ బయల్దేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో తారిక్ భార్య జుబైదా రెహమాన్, కూతురు జైమా రెహమాన్ ఉన్నారు. నా మాతృభూమికి వెళ్తున్నా అంటూ జైమా తీసిన సెల్ఫీ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసుకోగా సైతం వైరల్ అవుతోంది.
বাংলাদেশের উদ্দেশ্যে রওনা দিতে লন্ডনের হিথ্রো বিমানবন্দরে তারেক রহমান, জুবাইদা রহমান এবং জাইমা রহমান।#BNP #TariqueRahman #Bangladesh pic.twitter.com/E4hBYlBdJV
— Masud Rana (@MasudRana137969) December 24, 2025
బంగ్లాదేశ్ రాజకీయాలలో 'క్రౌన్ ప్రిన్స్'గా పేరున్న తారిక్ పునరాగమనం బీఎన్‌పీ కేడర్‌లోకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అదే సమయంలో.. ఓటర్లకు మంచి సందేశాన్ని కూడా పంపుతుందని ఆ పార్టీ భావిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మరికొద్ది నిమిషాల్లో ఆయన ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానున్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బీఎన్‌పీ అధినాయకురాలు ఖలీదా జియా కుమారుడే తారిక్ రెహమాన్. ఖాలిదా ప్రస్తుతం పలు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ ఢాకాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని రేసులో తారిక్ ముందు వరుసలో ఉన్నారు. ఆయనపై గతంలో కేసులు నమోదయ్యాయి. అందుకే ఇన్నేళ్లుగా ఆయన స్వదేశానికి తిరిగి రాలేదు.
డిసెంబర్ 16న లండన్‌లో జరిగిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కార్యక్రమంలో రెహమాన్ మాట్లాడుతూ.. 2026లో జరగనున్న జాతీయ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాను స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.
పసిప్రాయంలో జైలుకు!
తారిక్ రెహమాన్.. మాజీ అధ్యక్షుడు జియా-ఉర్-రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దోడు. 1965 నవంబర్ 20న జన్మించాడు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో.. తారిక్ రెహమాన్‌ను ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేశారు. ఆ టైంలో ఆయన వయసు ఆరేళ్లు!.
కాలం గడిచేకొద్దీ, తారిక్ రెహమాన్ తన తల్లితో కలిసి రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టారు. ఆనాటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడానికి వీధుల్లోకి వచ్చి 1988లో బీఎన్‌పీ జనరల్ సభ్యుడయ్యారు.ఆ సమయంలో ఆయన కింది స్థాయి కార్మికులను, మద్దతుదారులను సమీకరించి, హెచ్.ఎం. ఎర్షాద్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించారు. బీఎన్‌పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్-చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు, తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహబూబ్ అలీ ఖాన్ కుమార్తె డాక్టర్ జుబైదా రెహమాన్‌ను 1993లో వివాహం చేసుకున్నాడు. 2004 ఆగస్ట్‌లో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మరణించారు. 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. షేక్ హసీనా ఈ దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ కేసులో తారిక్ రెహమాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో ఖలీదానే ప్రధానిగా ఉన్నారు.
2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ రెహమాన్ అరెస్టు అయ్యారు. 2008లో ఆయనకి బెయిల్ వచ్చింది, చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి రెహమాన్ లండన్‌లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే బీఎన్‌పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
రెహమాన్ రాక భారత్‌కు మంచిదే!
బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 12న జరగనున్నాయి. దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి బీఎన్‌పీ బలమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో రెహమాన్ తిరిగి వస్తున్నారని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో.. భారత్‌తోనూ బంగ్లా సంబంధాలు మెరుగుపడొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బీఎన్‌పీ పట్ల సానుకూల ధోరణితో లేదు. పైగా తారిక్ రాకను శాంతి భద్రతల విఘాతంగా అభివర్ణిస్తోంది. అదే సమయంలో.. మైనారిటీలపై వరస దాడులను కట్టడి చేయడంలో విఫలమవుతూ ఇటు భారత్‌తోనూ సంబంధాల్ని యూనస్ దిగజారుస్తున్నారు. ఈ తరుణంలో ఖలీదా జియా ఆరోగ్యం మెరుగుపడాలంటూ భారత ప్రధాని మోదీ ఆకాక్షించడం.. తదితర పరిణామాలు చర్చకు వచ్చాయి.
ఆ ఒక్కటే మైనస్..
బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన రెహమాన్ ముందర కొన్ని సవాళ్లు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నా కూడా, బీఎన్‌పీ నాయకత్వం, పార్టీ మద్దతుదారులు ఆయనను ఉత్సాహంగా స్వాగతించారు. కానీ ఇన్నేళ్లు దేశానికి దూరంగా ఉన్న ఆయనకు ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉండకపోవచ్చని ఆ పార్టీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో వాళ్లందరినీ ఒప్పించాల్సిన బాధ్యత ఆయన ముందు ఉంది.
పైగా రెహమాన్ లండన్‌లో ఉన్నప్పుడు షేక్ హసీనా ప్రభుత్వ చర్యల వల్ల బీఎన్‌పీ శ్రేణులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఈ అసంతృప్తిని కూడా ఆయన చల్లార్చాల్సి ఉంటుంది. అయితే.. సెప్టెంబర్‌లో ఢాకా యూనివర్శిటీ క్యాంపస్ ఎన్నికల్లో బీఎన్‌పీ విద్యార్థి విభాగం విజయం సాధించింది. దీంతో.. ఈ ఎన్నికను బంగ్లాదేశ్‌లో రాజకీయ దిశను సూచించే ముఖ్యమైన సంకేతంగా అక్కడి విశ్లేషకులు పరిగణిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇది రెహమాన్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న యూనస్ తాత్కాలిక ప్రభుత్వంతో మాత్రం ఆయన చేతులు కలపొద్దని బీఎన్‌పీ శ్రేణులు బలంగా డిమాండ్ చేస్తుండడం గమనార్హం.


