క్రిస్మస్ పండుగ వేళ.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ హింస చెలరేగింది. బుధవారం స్థానిక మొఘ్‌బజార్ ఇంటర్‌సెక్షన్ వద్ద బంగ్లాదేశ్ ముక్తిజోద్ధా సంగ్‌సాద్ సెంట్రల్ కమాండ్ సమీపంలో శక్తివంతమైన క్రూడ్ బాంబు పేలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఢాకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం 7:10 గంటల ప్రాంతంలో మొఘ్‌బజార్ ఫ్లైఓవర్ నుండి బాంబును విసిరారు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక అధికారులు తెలిపారు.
ఇంతకాలం ప్రవాసంలో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నాయకుడు తారిక్ రెహమాన్.. తాజాగా ఢాకాలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆయన రాక నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈలోపే ఆయన పర్యటనకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. డిసెంబర్ 12న షరీఫ్ ఉస్మాన్ హాది అనే రాడికల్ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత బంగ్లాదేశ్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు పెరిగాయి. మయమన్‌సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడు మతవిద్వేష వ్యాఖ్యల ఆరోపణల నేపథ్యంలో మూకహత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మైనారిటీ సంఘాలు ఆందోళనలకు దారి తీయడంతో పాటు భారత్‌తో యూనస్ ప్రభుత్వానికి సంబంధాలను మరింత దెబ్బ తీసే విధంగా మార్చాయి. ఈలోపు డిసెంబర్ 22వ తేదీన మొతలేబ్ షిక్దర్ అనే మరో యువ నేతపై కాల్పులు జరిగాయి. తాజా పరిస్థితుల(ఢాకా బాంబ్ ఎటాక్) నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


