ఇంగ్లండ్ యువ పేసర్ జోష్ టంగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బౌలర్.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రసిద్ధ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో 21వ శతాబ్దంలో టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఇంగ్లండ్ తొలి బౌలర్‌గా 28 ఏళ్ల టంగ్ నిలిచాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
3-0తో సిరీస్ సొంతం చేసుకున్న ఆసీస్
ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టు.. తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆసీస్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో జోష్ టంగ్‌దే ముఖ్య భూమిక. టాపార్డర్‌లో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10), వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (6) రూపంలో కీలక వికెట్లు తీసిన టంగ్... అద్బుతమైన డెలివరీతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) రూపంలో మరో డేంజరస్ బ్యాటర్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు.
WHAT A DELIVERY!
Steve Smith looks on puzzled after this peach from Josh Tongue.#Ashes | #PlayoftheDay | @nrmainsurance pic.twitter.com/NpkEgGxOQR— cricket.com.au (@cricketcomau) December 26, 2025
తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా
అదే విధంగా లోయర్ ఆర్డర్లో పట్టుదలగా నిలబడ్డ ఆసీస్ పేసర్ మైకేల్ నాసర్ (35)ను కూడా అవుట్ చేసిన టంగ్.. ఆఖరిగా స్కాట్ బోలాండ్‌ను డకౌట్ చేసి తన ఖాతాలో ఐదో వికెట్ జమచేసుకున్నాడు. తద్వారా ఎంసీజీలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి.. 21వ శతాబ్దంలో ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఇంగ్లండ్ ఇతర బౌలర్లలో గస్ అట్కిన్సన్ రెండు, బ్రైడన్ కార్స్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు.
ఫలితంగా 29.5 ఓవర్లలో కేవలం 110 పరుగులు చేసిన ఇంగ్లండ ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాసర్ నాలుగు, బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.


