ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక స్వల్ప స్కోరుకే చాపచుట్టేశారు. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కంగారూలు ఇప్పటికే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐదు టెస్టులలో భాగంగా తొలి మూడు గెలిచి ఆసీస్ 3-0తో ఆధిక్యంలో ఉంది.
ఈ క్రమంలో ఆసీస్- ఇంగ్లండ్ (Aus vs Eng) మధ్య మెల్‌బోర్న్ వేదికగా శుక్రవారం నాలుగో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆది నుంచే ఇంగ్లండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ కంగారూ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు
డేంజరస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ (12)ను అట్కిన్సన్ బౌల్డ్ చేయగా.. మరో ఓపెనర్ జేక్ వెదరాల్డ్ (10)ను టంగ్ వెనక్కి పంపాడు. ఇక వన్‌డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ (6)తో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్న టంగ్.. ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.
ఇక ఉస్మాన్ ఖవాజా (29)ను అట్కిన్సన్ వెనక్కి పంపగా.. అలెక్స్ క్యారీ (20) బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (17) రనౌట్ కాగా.. టెయిలెండర్లలో మైకేల్ నాసర్ (35) కాసేపు పోరాడగా.. టంగ్ అతడిని బౌల్డ్ చేశాడు.
ఐదేసిన టంగ్.. ఆసీస్ ఆలౌట్
ఆఖర్లో మిచెల్ స్టార్క్ (1) రూపంలో బ్రైడన్ కార్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోగా.. స్కాట్ బోలాండ్ (0)ను అవుట్ చేసిన టంగ్ ఐదో వికెట్ తీశాడు. జే రిచర్డ్‌సన్ (0) నాటౌట్‌గా నిలవగా.. ఆసీస్ 45.2 ఓవర్లలో కేవలం 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ జట్టు బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. అట్కిన్సన్‌కు రెండు, బ్రైడన్ కార్స్, స్టోక్స్‌లకు చెరో వికెట్ దక్కాయి.


