‘భద్రత’పై 504 కార్యక్రమాలు నిర్వహించాం: శిఖాగోయల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజల్లో సైబర్ నేరాలపట్ల అవగాహన పెంచడం..సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సైబర్ జాగరూకత’పేరిట ప్రతినెలా మొదటి బుధవారం ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం సెలవు కావడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా టీజీసీఎస్‌బీ, పోలీస్ సిబ్బంది ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, పలు ప్రాంతాల్లో మారి్నంగ్ వాకర్స్ కోసం 117 సెషన్లు, విద్యార్థులు, వృద్ధులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు ఇతర సాధారణ పౌరుల కోసం 387 అవగాహన సెషన్లు నిర్వహించినట్టు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లకు చిక్కి మోసపోతే వెంటనే 1930 నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ‘వెబ్‌సైట్’లో ఫిర్యాదు చేయడం, డబ్బు పోయినట్టు గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు ఫోన్ చేసి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసేలా కోరడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్టు శిఖాగోయల్ వెల్లడించారు.


