మొత్తం దరఖాస్తుల్లో 70 శాతం మాత్రమే ఆర్డీఓల లాగిన్‌కు..
ఆర్డీఓల ద్వారా అందులో సగం దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం
అందులోనూ 60% పైగా తిరస్కరణ.. కొన్నింటి విషయంలో వేచి చూసే ధోరణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాదా బైనామాల పరిష్కారంలో సాగదీత ధోరణి కనిపిస్తోంది. శాస్త్రీయత పేరుతో ఈ దరఖాస్తులను పరిష్కరించేందుకు రూపొందించిన నిబంధనలు అడ్డుగా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి పరిష్కారానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైన సాదాబైనామా దరఖాస్తులు ఇంకా వేల సంఖ్యకు చేరలేదు. మొత్తం 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటి వరకు ఆయా దరఖాస్తులకు నోటీసులు జారీ చేసిన రెవెన్యూ శాఖ, వాటి పరిష్కారానికి మాత్రం కొర్రీలు పెడుతోందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఎక్కువ శాతం తిరస్కరణే
సాదాబైనామాల పరిష్కారానికి ఇదే చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టంలో వెల్లడించింది. అంటే తెలంగాణలో ఇక ముందు తెల్ల కాగితాల ద్వారా భూముల క్రయ విక్రయ లావాదేవీలు జరగవన్నమాట. అలాంటి పరిస్థితుల్లో చాలా నిశితంగా జరగాల్సిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం నెమ్మదించింది. అందులోనూ ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయని రెవెన్యూ వర్గాలే చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీ నాటి గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 118 సర్వే నంబర్ల పరిధిలోని దరఖాస్తులను మాత్రమే ఆమోదించగా, 3.65 లక్షల సర్వే నంబర్ల పరిధిలోనికి వచ్చే దరఖాస్తులను తిరస్కరించారని గణాంకాలు చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 9 లక్షలకు పైగా దరఖాస్తుల్లో 6 లక్షలకు పైగా దరఖాస్తులను తహసీల్దార్లు తమ లాగిన్‌ల నుంచి ఆర్డీఓలకు బదిలీ చేయగా, వాటిని పరిశీలించిన అనంతరం 2.97 లక్షలను మాత్రమే పరిష్కరించారు. ఇందులోనూ 60 శాతానికి పైగా తిరస్కరించనవేనని గణాంకాలు చెబుతున్నాయి.
ఆ మూడు కారణాలు
సాదాబైనామా దరఖాస్తులను ఆమోదించేందుకు మూడు ప్రధాన కారణాలు అడ్డంకిగా మారుతున్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
⇒ అమ్మిన వారు లేదంటే వారి వారసులు ఇవ్వాల్సిన అఫిడవిట్ ప్రతిబంధకంగా మారుతోంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం తెల్ల కాగితం ద్వారా అమ్మిన భూమి తమదేనని, తమ తండ్రి లేదంటే తాత ఈ భూమిని ఫలానా వ్యక్తికి అమ్మారని వారి వారసులు అఫిడవిట్ ఇవ్వాల్సి రావడం చాలా ఇబ్బందిగా మారుతోందని రైతులు వాపోతున్నారు. అయితే, ఈ అఫిడవిట్ నిబంధనను అవసరమైతే ఎత్తివేస్తామని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన తమ దగ్గరకు రాలేదని, అసలు ఆ అవసరమే రాలేదని రెవెన్యూ క్షేత్రస్థాయి వర్గాలు చెబుతున్నాయి. అఫిడవిట్లు వచ్చిన వారి దరఖాస్తులు ఆమోదిస్తున్నామని, మిగిలినవి ఆన్‌లైన్‌లోనే తిరస్కరిస్తున్నామని, ఇప్పుడు అఫిడవిట్ నిబంధన ఎత్తివేసినా ప్రయోజనం ఉండదని వారంటున్నారు.
⇒ ఎప్పుడో కొనుగోలు కోసం రాసుకున్న తెల్ల కాగితం లేని వారి దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారు. గతంలో సాదాబైనామాలను పరిష్కరించినప్పుడు రైతు కబ్జాలో ఉన్నారా లేదా? అనే విషయాన్ని పరిశీలించి చుట్టుపక్కల రైతుల స్టేట్‌మెంట్లు తీసుకునేవారు. దీంతో పాటు కాస్తు కాలంను కూడా చెక్ చేసి అందులో పేరు ఉంటే ఆ దరఖాస్తులను ఆమోదించే వారు. కానీ ఇప్పుడు కచ్చితంగా సేల్‌డీడ్ (తెల్ల కాగితం) ఉండాల్సిందేననే నిబంధన కారణంగా కూడా చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అఫిడవిట్‌తోపాటు సేల్‌డీడ్ లేని చాలా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.
⇒ కొన్నిచోట్ల మార్కెట్ రేట్‌కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు కూడా ఇబ్బందిగా మారుతోందని, ఈ నేపథ్యంలో సాదాబైనామాల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోకపోతే అందివచ్చిన మంచి అవకాశం చేజారిపోతుందని రెవెన్యూ వర్గాలే చెబుతుండడం గమనార్హం. 


