యువకుడికి దగ్గరవుతోందని కూతురును కడతేర్చిన తల్లిదండ్రులు
ఆపై ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరణ
కరీంనగర్ జిల్లాలో పరువుహత్య!
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
సైదాపూర్: ఓ పెళ్లయిన యువకుడు తమ కూతురు వెంటపడుతున్నాడని... ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగుబంధాన్ని తుంచుకున్నారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, చావకపోవడంతో గొంతు నులిమి చంపేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది.
గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు(16) మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) కొంతకాలంగా ప్రేమపేరిట వేధిస్తున్నాడు. అనిల్‌కు అప్పటికే వివాహమైందని, అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ, బాలికతో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు. చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువుపోతోందని భావించారు.ఈ క్రమంలోనే కూతురును చంపాలని నిర్ణయించుకున్నారు.
విష పురుగు కుట్టిందని.. ఆత్మహత్య చేసుకుందని..
నవంబర్ 14న రాత్రి కుటుంబసభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు. మరునాడు ఉదయం 4గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని, నోట్లోంచి నురగలు వచ్చాయని, ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోదించాడు.
తన కూతురు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతోందని, పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ 15న పోలీసుస్టేషన్‌కు వెళ్లి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమపేరుతో వేధించాడని, ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుసుకున్నారు.
దీంతో రాజు, లావణ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పెళ్లయిన వ్యక్తికి తమ కూతురు దగ్గరైతే.. తమ పరువు పోతుందని భావించి, తామే తమ కూతురును చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని, ఆడ పిల్లలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్‌ఐ తిరుపతి, ఏఎస్‌ఐ తిరుపతి పాల్గొన్నారు.


