ఆమె పంపిణీ చేసిన బీర్లు, చీరలు, కూల్‌డ్రింక్స్ పంచాయతీ కార్యాలయం ఎదుట వేసి వార్డు ప్రజల నిరసన
రామారెడ్డి(ఎల్లారెడ్డి): పంచాయతీ ఎన్నికల్లో ఓ వార్డుకు పోటీ చేసిన మహిళ ఓటమి పాలైంది. అప్పటి నుంచి బూతు పురాణం అందుకుంది. వార్డు ప్రజలను నోటి కొచ్చినట్టు తిడుతోంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వార్డు ఓటర్లు ఆమె పంపిణీ చేసిన బీర్లు, చీరలు, కూల్‌డ్రింక్స్‌ను గ్రామ పంచాయతీ ముందు పెట్టి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బాబవ్వ ఉప్ప లవాయి పంచాయతీలోని 2వ వార్డుకు పోటీ చేసింది. ఓట ర్లను ఆకట్టుకునేందుకు బీర్లు, మహిళలకు చీరలు, కూల్‌డ్రింక్స్ పంపిణీ చేసింది. ఓటమి పాలైన రోజు నుంచి వార్డు ఓటర్లను ఇష్టానుసారంగా పరుష పదజాలంతో దూషిస్తోందని వార్డు ప్రజలు వాపోయారు.
గురువారం కూడా బాబవ్వ తన నోటికి పని చెప్పడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పంపిణీ చేసిన చీరలు, బీర్లు, కూల్‌డ్రింక్స్‌ను పంచాయతీ కార్యాలయం ఎదుట పడేసి నిరసన తెలిపారు. ఇదే మండలంలోని మరో రెండు మూడు గ్రామాలలో ఓటమిపాలైన వార్డు సభ్యులు తాము పంపిణీ చేసిన ఆండాలు (ఫంక్షన్లకు ఉపయోగించే వంట సామగ్రి ), బగోనేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చేసేదిలేక తిరిగి ఇచ్చేశారు.


