చెల్లింపులను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ
హెల్త్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురావాలని టీజీజీడీఏ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో వైద్యులు ప్రతినెలా వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బాపనపల్లి నరహరి, లాలూప్రసాద్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతినెలా 20 నుంచి 25వ తేదీ వరకు వేతన చెల్లింపులు జరుగుతున్నాయని, గత రెండేళ్లుగా ఇదేతంతు కనిపిస్తోందని మండిపడ్డారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెలలో ఇప్పటికీ వేతనాలు అందలేదని, దీంతో వైద్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. వీవీపీ పరిధిలోని వైద్యుల వేతన చెల్లింపులను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


