తల వేలాడేస్తున్న.. పైలట్‌ పక్షులు | Survey finds 83 percent of Indian pilots suffer from severe fatigue | Sakshi
Sakshi News home page

తల వేలాడేస్తున్న.. పైలట్‌ పక్షులు

Dec 12 2025 2:34 AM | Updated on Dec 12 2025 2:34 AM

Survey finds 83 percent of Indian pilots suffer from severe fatigue

మితి మీరిన పని గంటలు

ఊపిరి సలపనివ్వని షెడ్యూళ్లు

ఒత్తిడి, నిద్రలేమి, తీవ్ర అలసట

గత జూన్‌లోనే సర్వే హెచ్చరిక!

పైలట్ల పని వేళల విషయంలో పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టం లేక ఇష్టారాజ్యంగా విమానాలు రద్దుచేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసింది ఇండిగో సంస్థ. ఈ నేపథ్యంలో పైలట్ల పని గంటలు, వారిపై ఒత్తిడి వంటి అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

భారత పౌర విమానయాన రంగం శరవేగంతో ‘టేకాఫ్‌’ అవుతున్నప్పటికీ, నియమ నిబంధనలకు విరుద్ధంగా పైలట్‌ల చేత పని చేయించటం అన్నది ఊహించని ‘పక్షిఘాతం’లా పరిణమించే ప్రమాదం ఉందని ‘సేఫ్టీ మేటర్స్‌ ఫౌండేషన్‌’ అనే ఎన్జీఓ గత జూన్‌లోనే హెచ్చరించిన విషయం తాజాగా వార్తల్లోకి వచ్చింది.

‘సేఫ్టీ కల్చర్‌ సర్వే –2024: పైలట్‌ ఫెటీగ్‌ అండ్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌’ పేరిట 530 మంది పైలట్‌ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న ‘సేఫ్టీ మేటర్స్‌ ఫౌండేషన్‌’.. పనిభారం పైలెట్‌లకు కుంగదీస్తోందని వెల్లడించింది. ఇది భారతీయ పైలట్ల ఆరోగ్యం, భద్రత వంటి అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ.

విమాన విధులు–సమయ పరిమితులలో ప్రభుత్వం చేసిన మార్పులను అమలు చేయకపోవటం వల్ల పైలట్‌లు అలసటకు గురవుతున్నారని తెలిపింది. పైలట్‌లకు విశ్రాంతి తప్పనిసరి అని, రాత్రి విధులను కుదించవలసిన అవసరం కూడా ఉందని సూచించింది.

డిమాండ్‌ను తట్టుకునేందుకే!
అదనపు పనిగంటలు, ఇతర వృత్తి సంబంధ మార్పుల వల్ల భారతీయ పైలట్లలో 83 శాతం మంది  తీవ్రమైన అలసటకు గురవుతున్నట్లు సర్వే గుర్తించింది. పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో డిమాండ్‌ను తట్టుకోవటానికి రాత్రి నడిపే విమాన సర్వీసులను పెంచటం కూడా సమస్యకు కారణం అవుతున్నట్లు సర్వే వివరించింది. ఇండియాలో ఒక పైలట్‌ సగటు విమాన పని గంటలు 2015లో 407 వరకు ఉండగా,  2020లో అవి 165 గంటలకు తగ్గినప్పటికీ, తిరిగి 2024లో 246 గంటలకు పెరిగాయని సర్వే పేర్కొంది.

‘రోస్ట్‌’ చేస్తున్న రోస్టర్‌! 
సేఫ్టీ కల్చర్‌ సర్వే – 2024 ప్రకారం, తరచు జరుగుతున్న రోస్టర్‌ మార్పులు (పైలట్‌ విధుల వేళల్లో మార్పులు) తమ అలసటకు కారణం అవుతున్నట్లు 74 శాతం పైలట్లు తెలిపారు. 19.4 శాతం మంది మరీ అంత స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, మార్పులు గణనీయమైన ప్రభావాన్నే చూపుతున్నాయని అంగీకరించారు.

రీ–అసైన్ మెంట్‌లు
విమానయాన సంస్థలు పైలట్‌లకు మొదట కేటాయించిన విమానాన్ని మార్చినప్పుడు (టెయిల్‌ స్వాప్‌) పైలట్‌లు ఒత్తిడికి, అలసటకు లోనవుతున్నట్లు సర్వే గుర్తించింది. దాదాపు 63.8 శాతం మంది పైలట్‌లు టెయిల్‌ స్వాప్‌ అనేది తీవ్రమైన అలసటను కలిగిస్తుందని అన్నారు.

పెద్దగా పెరగలేదు
భారతదేశంలో పైలట్ల సంఖ్య 2015లో 3,973 నుండి 2024లో 11,775కి పెరిగింది. కానీ ఈ పదేళ్లలో పైలట్‌–ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిష్పత్తి 13.8–14.5 మధ్యలోనే స్థిరంగా ఉంది. అంటే ప్రతి విమానానికీ 13 నుంచి 15 మధ్య మాత్రమే పైలట్‌లు ఉన్నారన్నమాట. (ఆధారం : డి.జి.సి.ఎ.)

పెరిగిన పని గంటలు
కోవిడ్‌ తర్వాత చాలా భారతీయ విమానయాన సంస్థలు పైలట్‌ సగటు విమాన ప్రయాణ గంటలను పెంచేశాయి.  2024 (నవంబర్‌ వరకు) లో మాత్రం ప్రయాణ గంటల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement