సాక్షి, సెంట్రల్ డెస్క్: ఏంటిది.. హైవేపై ఈ ఎర్రటి గుర్తులేంటని ఆశ్చర్యపోతున్నారా? దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్–భోపాల్ జాతీయ రహదారిపై వేసిన రెడ్ టేబుల్ టాప్ మార్కింగ్స్ ఇవి. ఈ హైవేలోని 12 కిలోమీటర్ల మార్గం వీరంగనా దుర్గావతి టైగర్ రిజర్వ్, నౌరాదేహి వైల్డ్‌లైఫ్ శాంక్చురీ మీదుగా సాగుతుండటంతో అతివేగంగా వచ్చే వాహనా లు ఢీకొని జింకలు, నక్కలు, దుప్పుల వంటి వన్యప్రాణులు తరచూ ప్రమా దాలకు గురవుతున్నాయి.
ఇక్కడ మూల మలుపులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు దాటే వన్యప్రాణులు వాహనదారులకు అతిసమీపానికి వచ్చే దాకా కనిపించడంలేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. మొత్తం 12 కి.మీ. మార్గంలో రెడ్ మార్కింగ్స్ వేయడంతోపాటు అందులోని 2 కి.మీ. మార్గంలో ప్రత్యేకంగా 5 మిల్లీమీటర్ల మేర కాస్త ఉబ్బెత్తుగా ఉండేలా ఎర్రటి మార్కింగ్స్ వేసింది. దీనివల్ల వాహనదారులు ఈ 12 కి.మీ. మార్గంలోకి ప్రవేశించగానే వన్యప్రాణులు రోడ్డు దాటొచ్చని వారు అప్రమత్తమయ్యేందుకు వీలవుతోంది. 
ముఖ్యంగా 2 కి.మీ. దూరంపాటు ఉబ్బెత్తుగా వేసిన మార్కింగ్స్ వల్ల వాహనదారులు స్వల్పంగా కుదుపులకు గురవుతూ వాహ నాలను నెమ్మదిగా నడపడం సాధ్యమ వుతోంది. ఫలితంగా వన్యప్రాణులకు గతంతో పోలిస్తే సురక్షితంగా రోడ్డు దాటేందుకు మార్గం సుగమమైంది. అలాగే వన్యప్రాణులు సాఫీగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ హైవేపై 25 చోట్ల అండర్‌పాస్‌లను కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించింది.


