
నగరం అంటే ట్రాఫిక్ నరకం. ఇది కాదనలేని సత్యం. ఉండటానికి ఫ్లై ఓవర్స్ ఉంటాయి. నేషనల్ హైవేలు సైతం అనుసంధానంగా కూడా ఉంటాయి. కానీ ట్రాపిక్ సుఖం మాత్రం ఉండటం లేదు. ఇక్కడ ఏదో ఒక నగరం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ నగరం చూసినా ఇంచుముంచు ఇదే పరిస్థితి.
ఇక వర్షం పడితే ఆ నరకం వర్ణనాతీతం. సాధారణ ప్రజలైతే ఆ నరకాన్ని దాటుకుంటూ ఏదో రకంగా తమ గమ్యాలకు చేరతారు. కానీ ఏదైనా విషమ పరిస్థితుల్లో ఉన్నవారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మాత్రం ఏం జరుగుతుందో మన ఊహకు కూడా అందదు.
ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు మహారాష్ట్రలోని పాల్గర్ ప్రాంతానికి చెందిన దంపతులు. భర్త కళ్ల ముందు భార్య విపరీతమైన నరకయాతన అనుభవిస్తున్న చేసేది లేక అంబులెన్స్‌లో అలా ఉండిపోయాడు. భార్య పడిన నరకాన్ని కళ్లరా చూసి.. బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం విఫలమైంది. దీనికి కారణం ట్రాఫిక్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యను తీసుకుని నేషనల్ హైవే మీద చిక్కుకుపోయిన ఘటన హృదయవిదారకంగా ఉంది.
పల్ఘార్‌కు చెందిన చయ్యా పూరవ్ అనే 49 ఏళ్ల మహిళకు తీవ్రంగా గాయపడింది. చయ్యా పూరవ్ ఇంటి వద్ద ఉన్న ఒక చెట్టు కొమ్ము ఆమెపై విరిగిపడింది. దాంతో ఆమె తీవ‍్ర రక్తస్రావం జరిగింది. స్థానిక ఆస్పత్రికి తీసుకెళితే, ముంబైలోని హిందుజా ఆస్పత్రి రిఫర్ చేశారు. దాంతో ఆమెను తీసుకుని అంబులెన్స్‌లో బయల్దేరాడు భర్త. అయితే నేషనల్ హైవే-48;పై వెళితే అక్కడకు చేరడానికి పెద్ద సమయం పట్టదు. పల్ఘార్ నుంచి ముంబై వెళ్లడానికి అది అనువైన రహదారి కూడా.
100 కి.మీ దూరం ఉన్న ముంబైని చేరుకోవడానికి ఎంత లెక్కన వేసుకున్నా రెండు గంటలన్నర కంటే ఎక్కువ పట్టదు. అయితే నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సగం దూరం చేరడానికే మూడు గంటలకు పైగా సమయం పట్టింది. అప్పటికే ఆమె పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోతోంది. కానీ భర్త ఏం చేసే పరిస్థితి లేదు. ఆ ట్రాఫిక్‌ను ఛేదిస్తే గానీ భార్య పడే నరకానికి ఫుల్‌స్టాప్ పెట్టలేడు.
ఈ క్రమంలోనే 70 కి.మీ దూరం వెళ్లేసరికి ఆమె సృహలోకి లేకుండా మారిపోయింది. దాంతో అక్కడ ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకు వెళితే ఆమె చనిపోయిందని డాక్టర్టు నిర్దారించారు. ఎంత ప్రేమేగా చూసుకునే భార్య కళ్ల ముందే విలవిల్లాడిపోతుంటే చేసేది లేకుండా పోయిందని భర్త అంటున్నారు. తన భార్య నాలుగు గంటల పాటు తీవ్ర నరకయాతన అనుభవించిందని, అది తన కళ్లతో చూశానని బోరు మంటున్నారు. ట్రాఫిక్ కారణంగానే తన భార్యను కాపాడులేకపోయానని భర్త పూరవ్ కన్నీటి పర్యంతమయ్యారు. అరగంట ముందుగా ముంబై ఆస్పత్రికి వెళ్లినా తన భార్యను కాపాడుకునే వాడినని పూరవ్ బాధాతప్త హృదయంతో మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. గత నెల 31వ తేదీన జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.