వెల్లువెత్తుతున్న ఏఐ స్లాప్ చానెళ్లు
అక్టోబర్ నాటికి 6,300 కోట్ల వ్యూస్
టాప్‌లో నిలిచిన బందర్ అప్నా దోస్త్
ప్రపంచంలో అతిపెద్ద వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్‌లో విలువ లేని, పనికి రాని వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా బిలియన్ల కొద్దీ మొబైల్ స్క్రీన్‌పై దర్శనమిస్తున్నాయి. నూతన యూజర్ల స్క్రీన్‌పై వచ్చే షార్ట్స్‌లో ఏఐతో తయారైన బ్రెయిన్ రాట్ వీడియోలు అయిదింట ఒక వంతు కైవసం చేసుకున్నాయి. వీటితో వీక్షకులకు సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనంచేకూర్చకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్
క్యాప్‌వింగ్ నివేదిక ప్రకారం...
క్లౌడ్ ఆధారిత ఆన్‌లైన్ వీడియో ఎడిటర్ క్యాప్‌వింగ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 15,000 యూట్యూబ్ చానెళ్లను కంపెనీ అధ్యయనం చేసింది. ప్రతి దేశం నుంచి టాప్–100 చానెళ్లు వీటిలో ఉన్నాయి. 278 చానెళ్లు పూర్తిగా ఏఐ స్లాప్ కంటెంట్‌ను మాత్రమే ప్రసారం చేస్తున్నాయి. ఏఐ స్లాప్ చానెళ్లు 2025 అక్టోబర్ నాటికి 6,300 కోట్లకుపైగా వ్యూస్, 22.1 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించాయి. ఏటా ఇవి సుమారు రూ.1,050 కోట్లు ఆర్జిస్తున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఏఐ స్లాప్ యూట్యూబ్ చానెళ్లలో మన దేశానికి చెందిన ‘బందర్ అప్నా దోస్త్’అత్యధిక వ్యూస్‌తో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ విభాగంలో ఏటా రూ.38 కోట్లకుపైగా ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్‌లో నిలిచింది.
నివేదిక హైలైట్స్..
⇒ 207 కోట్లకుపైగా వ్యూస్‌తో భారత్‌కు చెందిన ‘బందర్ అప్నా దోస్త్’ఏఐ స్లాప్ చానెల్ అంతర్జాతీయంగా టాప్‌లో నిలిచింది.
⇒ ప్రపంచంలో అత్యధికంగా స్పెయిన్‌కు చెందిన ట్రెండింగ్ ఏఐ స్లాప్ చానెల్స్‌కు 2 కోట్ల మందికిపైగా సబ్‌స్రై్కబర్స్ ఉన్నారు.
⇒ దక్షిణ కొరియాలో ప్రముఖ ఏఐ స్లాప్ చానెల్స్ 845 కోట్ల పైచిలుకు వ్యూస్ నమోదు చేశాయి.
⇒ యూఎస్‌లోని స్లాప్ చానెల్ క్యూంటోస్ ఫాసినాంటెస్ (సిక్) 59.5 లక్షల మంది సబ్‌స్రై్కబర్స్ కలిగి ఉంది.
⇒ కొత్త యూజర్లకు వచ్చే ఫీడ్‌లో తొలి 500 యూట్యూబ్ షార్ట్స్‌లో బ్రెయిన్‌రాట్ వీడియోలు దాదాపు 33% ఉన్నాయి.
⇒ నూతన యూజర్ల స్క్రీన్‌పై వచ్చే మొదటి 500 షార్ట్స్‌లో ఏఐ స్లాప్ వీడియోలు 21% కైవసం చేసుకున్నాయి.
ఏఐ స్లాప్
తగినంత శ్రద్ధ, కచ్చితత్వం, ఆలోచన లేకుండా సబ్‌స్క్రిప్షన్స్, వ్యూస్ కోసమే ఆటోమేటిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉపయోగించి రూపొందించి, పంపిణీ చేసిన విలువ లేని, పనికిరాని ఏఐ వీడియోలు. కంటెంట్‌లో లోపాలకుతోడు ప్రతికూల ప్రభావాలకు ఇవి దారితీస్తాయి.
బ్రెయిన్‌రాట్
నియంత్రణ, అర్థం లేని, తక్కువ నాణ్యత గల ఏఐ, ఏఐ రహిత వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు వీక్షకుడి మానసిక, మేధోస్థితిని క్షీణింపజేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.


