ముంబైలో జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదం ఒక బాలనటి కుటుంబంలోనూ, ఆ చిన్నారి జీవితంలో మర్చిపోలేని విషాదాన్ని నింపింది. ఒక మూవీ ఆడిషన్‌కోసం వెళ్లిన 13 ఏళ్ల మరాఠీ బాలనటి చాలా ఉత్సాహంగా తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ అదే తన జీవితంలో అంతులేని శోకాన్ని మిగులుస్తుందని ఊహించలేదు. కళ్లముందే కన్న తల్లి ప్రాణాలు పోతోంటే.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోయింది. పదే పదే ఆ దృశ్యాల్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం ముంబైలోని భాండుప్‌లో బెస్ట్ రూట్ 606లో ఒక ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అదుపు తప్పి బస్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై దూసుకెళ్లింది. 35 ఏళ్ల ప్రణీత సందీప్ రసం, తన కుమార్తెను ఆడిషన్ కోసం దాదార్ వెళ్లి తిరిగి వస్తూ, భాండుప్ రైల్వే స్టేషన్ సమీపంలో దిగి బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంతలో బస్సు అదుపు తప్పిన బెస్ట్ ఎలక్ట్రిక్ బస్ తమవైపు దూసుకు రావడాన్ని గ్రహించిన తల్లి ప్రణిత, కుమార్తెను శక్తి కొలదీ పక్కకు తోసేసింది.
క్షణాల్లో అంతా జరిగిపోయింది.
తల్లి పక్కకు నెట్టివేయడంతో బాలనటి ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకుంది. కానీ ప్రణీత మాత్రం బస్సు చక్రాల కింద నలిగి పోయింది. తన కళ్లముందు తల్లి విగతజీవిగా మారిపోవడం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఎలాగోలా తేరుకుని, వేరే వారి ఫోన్ ద్వారా తండ్రి సందీప్‌కు ఫోన్ చేసింది. ఆయన సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ప్రణీత గాయాలతో మరణించింది. తల్లి తనను కాపాడుతూ చనిపోయిందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బాలనటిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. చికిత్స , కౌన్సెలింగ్ కోసం ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రణీత కుమార్తె మరాఠీ టీవీ సీరియల్స్‌లో చిన్న సహాయక పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. హోంవర్క్, షూటింగ్‌లను మేనేజ్ చేస్తూ నటించి పేరు తెచ్చుకున్న ఆమె ప్రతిభ వెనుక ప్రణిత కృషిచాలా ఉందని పొరుగు వారు గుర్తు చేసుకున్నారు. పాపను ఆడిషన్స్, సెట్స్‌కు తీసుకెళుతూ ఇంటిని చక్కబెట్టుకొనేదని చెప్పారు.
కాగా ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రణీతతోపాటు, మాన్సి మేఘశ్యాం గురవ్, 49, వర్ష సావంత్, 25, మరియు ప్రశాంత్ దత్తు షిండే, 45. మరో పదకొండు మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఎలక్ట్రిక్ బస్సు డ్రైవర్, 52 ఏళ్ల సంతోష్ రమేష్ సావంత్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
చదవండి: 2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనం విఖ్రోలి డిపోకు అనుబంధంగా ఉన్న రూట్ A-606 (సీనియర్ 34)లో నడుస్తున్న వెట్-లీజ్ ఒలెక్ట్రా బస్సు. సంఘటన జరిగిన సమయంలో డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ (52), కండక్టర్ భగవాన్ భావు ఘరే (47) విధుల్లో ఉన్నారని, ఇద్దరూ బెస్ట్ సిబ్బంది గా భావిస్తున్నారు. మరోవైపుమృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదీ చదవండి: లిఫ్ట్ ఇస్తామని, వ్యాన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం


