మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. కోటి ఆశలతో, మరింత నూతనోత్తేజంతో 2026 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఉవ్విళూరుతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, సకల శుభాలు, ప్రేమ, ఉత్సాహంతో నిండిన సరికొత్త ప్రారంభానికి స్వాగతం చెబుతాం. అలాగే రాబోయే సంవత్సరంలో మహిళలు మరిన్ని అవకాశాలు రావాలని, సాధికారత దిశగా మరింత సాహసోపేతమైన అడుగులు పడాలని యావత్ మహిళా లోకం కలలు గంటోంది.
కొత్త అడుగు వేసే ముందు, మునుపటి అడుగును, అనేక రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళలను గుర్తు చేసుకోవడం కూడా అవసరం.2025 సంవత్సరం సినిమా, రాజకీయం, సామాజిక రంగాలకు తీరని లోటును మిగిల్చింది. ఈ ఏడాది కన్నుమూసిన దేశీయ , అంతర్జాతీయ ప్రముఖ మహిళల వివరాలు చూద్దాం
భారతీయ ప్రముఖులు
బీ సరోజా దేవి (నటి): "అభినయ సరస్వతి"గా పేరుగాంచిన లెజెండరీ నటి సరోజా దేవి జూలై 14, 2025న కన్నుమూశారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో పోటా పోటీగా నటించి సినీ అభిమానులు గుండెల్లో సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటి.
సీ కృష్ణవేణి (నటి ): తొలితరం తెలుగు నటి, నిర్మాత అయిన కృష్ణవేణి గారు ఫిబ్రవరి 16, 2025న తన 100వ ఏట మరణించారు. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతలలో ఒకరు.
కామినీ కౌశల్ (నటి): బాలీవుడ్ స్వర్ణయుగపు నటి కామినీ కౌశల్ నవంబర్ 13, 2025న మరణించారు. 'నీచా నగర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె ప్రసిద్ధి చెందారు.
సిమోన్ టాటా (వ్యాపారవేత్త): భారతీయ సౌందర్య సాధనాల బ్రాండ్ 'లాక్మే' (Lakme) , 'ట్రెంట్/వెస్ట్‌సైడ్' అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా డిసెంబర్ 5, 2025న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

యువ నటి షెఫాలీ: 'కాంటా లగా' గర్ల్‌గా గుర్తింపు పొందిన షెఫాలీ జూన్ 27, 2025న గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో అకాల మరణం చెందడం ఆమె అభిమానులును తీవ్ర విషాదంలో ముంచేసింది.
సంధ్యా శాంతారామ్ (నటి): సీనియర్ నటి సంధ్య ఈ ఏడాది అక్టోబర్ 4, మరణించారు. ఆమె 'జనక్ జనక్ పాయల్ బాజే' వంటి క్లాసిక్ సినిమాల్లో నటనతో నభూతో నభవిష్యతి అనుపించుకున్నారు.
అంతర్జాతీయ ప్రముఖులు
ఖలీదా జియా (రాజకీయవేత్త): బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30 న మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30, 2025న మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో పుట్టి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక శక్తివంతమైన మహిళా నేతగా నిలిచారు.
జేన్ గుడాల్ (శాస్త్రవేత్త): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రైమాటాలజిస్ట్ మరియు పర్యావరణ కార్యకర్త జేన్ గుడాల్ అక్టోబర్ 1, 2025న 91 ఏళ్ల వయసులో మరణించారు. చింపాంజీల ప్రవర్తనపై ఆమె చేసిన పరిశోధనలు విప్లవాత్మకమైనవి.
డయాన్ కీటన్ (హాలీవుడ్ నటి): ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ అమెరికన్ నటి డయాన్ కీటన్ అక్టోబర్ 11న మరణించారు.
డేమ్ అన్నెట్ బ్రూక్: UKలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా లిబరల్ డెమొక్రాట్ MP ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. 2001లో డోర్సెట్‌లో సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన తొలి మహిళా MPగా ఆమె రికార్డ్ సృష్టించారు.
బ్రిజిట్ బార్డోట్ (నటి) ఫ్రెంచ్ సినిమా ఐకాన్ మరియు జంతు హక్కుల పోరాట యోధురాలు బ్రిజిట్ బార్డోట్ డిసెంబర్ 28, 2025న 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
కిమ్ సే-రాన్ (దక్షిణ కొరియా నటి): ప్రముఖ కొరియన్ నటి కిమ్ సే-రాన్ ఫిబ్రవరి 16, 2025న కేవలం 24 ఏళ్ల వయసులో మరణించడం ఆ దేశ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.
బార్బీ హ్సు (తైవానీస్ నటి): 'మెటియోర్ గార్డెన్' సీరీస్ ద్వారా ఆసియావ్యాప్తంగా గుర్తింపు పొందిన బార్బీ హ్సు ఫిబ్రవరి 2, 2025న మరణించారు.

వీరితోపాటు 2025 అనేక రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కోల్పోయాం. ముఖ్యంగా సినీ రంగంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, గోవర్దన్ అస్రానీ, సతీష్ షా, పంకజ్ ధీర్, జుబీన్ గార్గ్ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ చకుర్కర్ ఈ ఏడాదిలోనే మరణించారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా, టి.టి.కె. ప్రెస్టీజ్ కిచెన్ మొగల్ టి.టి. జగన్నాథన్ 77 ఏళ్ళ వయసులో మరణించారు ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకుడు , రచయిత కొన్ని దశాబ్దాల పాటు తన జీవితాన్ని పులుల సంరక్షణకు అంకితం చేసిన వాల్మిక్ థాపర్ క్యాన్సర్‌తో పోరాడుతూ 73 ఏళ్ళ వయసులో మే నెలలో కన్నుమూశారు.



