రాజకీయాల్లో శాశ్వత మిత్రులే కాదు... శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అందులోనూ అధికారం విషయంలో రాజకీయాలను సైతం రక్తసంబంధాలు నిర్ణయిస్తాయని చరిత్ర చెప్పిన సత్యం. దేశంలోనే అత్యంత సంపన్న నగరపాలక సంస్థ ‘బృహన్ ముంబయ్ కార్పొరేషన్’ (బీఎమ్సీ) ఎన్నికలకు అతి కొద్ది వారాలే ఉన్న నేపథ్యంలో ఆ మహానగర రాజకీయ దృశ్యంలో అక్షరాలా అదే కనిపిస్తోంది. మహారాష్ట్రలోని రెండు అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాలు మళ్ళీ ఒక్కటయ్యాయి. చీలికలు పేలికలైన శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లలో నిన్నటి దాకా కత్తులు దూసుకున్న పరస్పర ప్రత్యర్థి పవార్ కుటుంబ వర్గాలు, ఠాక్రే కుటుంబ వర్గాలు స్థానిక ఎన్నికలతో కలసి కాలు కదుపుతున్నాయి. దూరదృష్టి కన్నా రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం, రక్తసంబంధం ఆసరాగా పొడిచిన ఈ కొత్త పొత్తులతో అధికార కూటమిలోని పార్టీలు, ప్రతిపక్షంలోని పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి. చివరకు ఎవరు అధికార పక్షం, ఎవరు ప్రతిపక్షమనే స్పష్టత లేని పరిస్థితి. ఓటర్లే తికమకపడే దుఃస్థితి.
ముందుగా ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నుంచి 2006లో బయటకు వెళ్ళిపోయిన ఆయన సమీప బంధువు రాజ్‌ఠాక్రేలు దాదాపు రెండు దశాబ్దాల తమ శత్రుత్వానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇక, కొన్నేళ్ళుగా బాహాటంగా కత్తులు దూసుకున్న శరద్‌పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్‌కు మధ్య కూడా సంధి కుదిరింది. ఠాక్రేల విషయానికే వస్తే – ముందు నుంచి బాహాటంగా శుభాభినందనలతో మొదలుపెట్టి, ఉద్ధవ్ జన్మదిన సంద ర్భంగా 13 ఏళ్ళ తర్వాత మాతోశ్రీ నివాసానికి రాజ్ వెళ్ళడం దాకా ఓ పద్ధతి ప్రకారం రాజకీయ అడుగులు పడ్డాయి. అదేమంటే, మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అని నేతలిద్దరూ బల్లగుద్దారు.
ఇప్పటికే మహారాష్ట్రపై పట్టు కోల్పోయిన ఠాక్రేలు ఉమ్మడి శివసేన కాలంలో కంచుకోట లాంటి ముంబయ్‌నైనా కాపాడుకోవడానికే ఒక లెక్కప్రకారం ఈ పనికి దిగారు. కొన్నేళ్ళ క్రితం ఏక్‌నాథ్ శిందే పార్టీని చీల్చి చావుదెబ్బ తీసి, బీజేపీతో దోస్తీ కట్టడంతో... పార్టీ పేరు, చిహ్నం సైతం కోల్పోయి, శివసేన (యూబీటీ) పేరిట ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని నిలుపుకొనేందుకు ఉద్ధవ్ అస్తుబిస్తు అయ్యారు. మరోపక్క రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన సైతం అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం చిల్లర ఓట్లే సంపాదించి, నామమాత్రావశిష్టమైంది. అందుకే, ఠాక్రేల కుటుంబానికి ఈ తాజా ఎన్నికల దోస్తీ రాజకీయ అనివార్యత.
ముంబయ్, థానే, కల్యాణ్, ముంబయ్‌లోని ఇతర శివారు ప్రాంతాలతో పాటు పుణే, నాసికే, ఛత్రపతి శంభాజీ నగర్ తదితర ప్రాంతాల్లో నగరపాలిక ఎన్నికలు జరగ నున్నాయి. నిజానికి, ఇవంతా కలిపితే మొత్తం మహారాష్ట్రలో నాలుగోవంతు విస్తీర్ణం కూడా కాదు. కానీ, అనేక పరిశ్రమలకు నెలవైన అవి సంపన్న ప్రాంతాలు కావడంతో అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. పవార్‌ల కుటుంబం సైతం కలిసింది అందుకే. రెండేళ్ళ క్రితం 2023లో పార్టీని చీల్చి, బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన అజిత్ పవార్‌కు సైతం నిరుటి లోక్‌సభ ఎన్నికల్లో తలబొప్పి కట్టాక తత్వం బోధ పడింది. రాజకీయ ఆచరణవాదాన్ని ఆశ్రయించి, రానున్న పుణే, పింప్రీ – ఛింఛ్వాడీ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీతో కలసి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు పేరున్న రాజకీయ కుటుంబాల పునరేకీకరణ లక్ష్యం ఒకటే. బీజేపీ ప్రాబల్యానికి గండి కొట్టడమే. అది అంత సులభసాధ్యం అనిపించట్లేదు.
చిత్రమేమంటే, బీజేపీ పాలిత రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే బీజేపీపైన అజిత్ ఇలా పోటీకి దిగుతున్నారు. అలాగే శరద్ పవార్ తీర్చిదిద్దిన మహా వికాస్ అఘాడీలో ప్రధాన భాగమైన కాంగ్రెస్‌తో పవార్‌లు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజకీయాలంటే అంతే. అక్షరాలా థ్రిల్లర్ సినిమా లాంటివి. అంతా సాఫీగా సాగుతోంద నుకున్నవేళ కథలో ఊహించని మలుపు చోటుచేసుకుంటుంది. అందులోనూ ఎన్నికల వేళ ఈ ట్విస్టులు నాటకీయతను పెంచుతాయి. కొత్త ఏడాది జనవరిలోనే వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు మరిన్ని చోటుచేసుకోవడం ఖాయం. అటుపైన ఎన్నికల ఫలితాలను బట్టి మొత్తం కథే మారినా ఆశ్చర్యం లేదు.


