360 మంది అమాయకుల ప్రాణాలు పోయి ఉండేవి కావేమో
చేవెళ్ల జాతీయ రహదారి విస్తరణలో ఎన్‌హెచ్‌ఏఐ మొద్దునిద్ర
ఎన్‌జీటీలో కేసు పరిష్కారంలో చొరవ చూపని తీరు
నవంబర్ 3: బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి మేర రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించుకునేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపిన రోజు. విస్తరణకు అడ్డుగా ఉన్న మర్రి వృక్షాలను కాపాడాలంటూ వృక్ష ప్రేమికులు వేసిన కేసు ఆధారంగా ఇచ్చిన స్టేను తొలగించేందుకు సమ్మతించిన రోజు. ఇక రోడ్డు విస్తరణతో ఆ రోడ్డుపై జరుగుతున్న భారీ ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించే వీలుంటుందని సంబరం వ్యక్తమైన రోజు.. కానీ, సరిగ్గా అదేరోజు అదే రోడ్డుపై ఏకంగా 19 మందిని ఘోర ప్రమాదం పొట్టనపెట్టుకున్న రోజు.
సాక్షి, హైదరాబాద్: ఎన్‌హెచ్‌ఐఏ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు విస్తరణకు చొరవ చూపని కారణంగా, నిర్లక్ష్యంగా కాలయాపన చేసిన ఫలితంగా గత ఆరేళ్లలో 273 నిండుప్రాణాలను ఆ రోడ్డు బలితీసుకుంది. 2014 నుంచి పరిశీలిస్తే మరో 90 మంది చనిపోయినట్టు పేర్కొంటున్నారు. అది పేరుకే జాతీయ రహదారి.. కానీ, ఎక్కడా దానికి ఆ లక్షణం మాత్రం కనిపించదు. రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతున్నా ఇప్పటికీ అది సెంట్రల్ మీడియన్ లేని సాధారణ డబుల్ రోడ్డు మాత్రమే. చేవెళ్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలనే ప్రయత్నం దశాబ్దకాలంగా ‘సా..గు’తూనే ఉంది.
అదేదో ముందే చేసి ఉంటే.. 
విస్తరణలో కొట్టేయకుండా ఆ రోడ్డుపై ఉన్న 915 మర్రి వృక్షాలను కాపాడేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పర్యావరణ ప్రేమికులు ఎన్‌జీటీని ఆశ్రయించి ఆరేళ్లయినా సమస్యకు పరిష్కారం చూపకుండా ఎన్‌హెచ్‌ఏఐ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులపై ఒత్తిడి చేయించటంతో సమస్య పరిష్కారానికి వీలుగా ప్రత్యామ్నాయ విస్తరణ డిజైన్‌ను రూపొందించారు. కేసు దాఖలు చేసిన పర్యావరణ ప్రేమికులు కూడా ఆ డిజైన్‌కు మద్దతు తెలపటంతో ఎన్‌జీటీలో కేసు సులభంగా తేలిపోయింది. ఈ చొరవను ముందే తీసుకుని ఉంటే, ఇన్నేళ్లలో జరిగిన ప్రాణనష్టం భారీగా తగ్గిఉండేది. సోమవారం నాటి ఘోర ప్రమాదం కూడా తప్పి ఉండేదేమో. 

ప్రణాళిక లేని ఎన్‌హెచ్‌ఏఐ 
మర్రి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేస్తామన్న గాలి మాటలు తప్ప, పక్కా ప్రణాళికను ఎన్‌హెచ్‌ఏఐ ఎన్‌జీటీకి అందించలేకపోయింది. ఇలాంటి విస్తరణ సమయాల్లో పర్యావరణంపై ఉండే ప్రభావం అంచనాకు అధ్యయనం కూడా నిర్వహించాలి. దాన్ని కూడా చేపట్టకపోవటంతో ఎన్‌జీటీ మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ స్టడీ నిర్వహించినా, అది ప్రభావవంతంగా లేనందున మళ్లీ నిర్వహించాలని ఎన్‌జీటీ ఆదేశించాల్సి వచ్చిందంటే ఎన్‌హెచ్‌ఏఐ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తెచ్చే వరకు ఆ నిర్లక్ష్యం కొనసాగింది.
ఏడాదిన్నరలో పూర్తి చేసేలా చర్యలు  
ఎన్‌జీటీలో కేసు కొలిక్కి వచ్చినందున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించేలా ఎన్‌హెచ్‌ఏఐపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రతి 10 కి.మీ.కు ఓ బృందాన్ని ఏర్పాటుచేసి ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫలితంగా... రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు విస్తరణను ఏడాదిన్నరలో పూర్తిచేసేలా చూస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఇక రోడ్డు విస్తరణలో జాప్యం ఉండదు. - రామ్మోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
