సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీలు)పై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం,మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ తొమ్మిది జిల్లాల డీసీసీబీలను రద్దు చేస్తూ.. వాటి నిర్వహణ బాధ్యతలను తాత్కాలికంగా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తొమ్మిది జిల్లాల డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జులుగా జిల్లా కలెక్టర్లను నియమించింది. వారు ఆరు నెలల పాటు లేదా ఎన్నికలు పూర్తయ్యే వరకు బాధ్యతలు కొనసాగిస్తారు. డీసీసీబీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టర్లే తాత్కాలిక నిర్వాహకులుగా వ్యవహరించనున్నారు.
పునర్వ్యవస్థీకరణ
కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య ద్వారా సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైతులు, సహకార సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సేవలు అందించే డీసీసీబీలను కొత్త జిల్లాల ప్రకారం పునర్నిర్మించనున్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వం సహకార రంగంలో శక్తివంతమైన నియంత్రణను కొనసాగించాలనే ఉద్దేశ్యం స్పష్టమవుతోంది. కలెక్టర్ల నియామకం ద్వారా తాత్కాలికంగా రాజకీయ ప్రభావం తగ్గి, పరిపాలనా నియంత్రణ పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం రైతాంగం, సహకార సంఘాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. కొత్త జిల్లాల ప్రకారం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ పూర్తయ్యే వరకు కలెక్టర్లే డీసీసీబీలను నడిపించనున్నారు.


