సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల జిల్లా): బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎటువంటి నోరు విప్పకుండానే 33శాతం సీట్లను గెలుచుకున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లను సిరిసిల్లలో కేటీఆర్ సన్మానించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు లేనట్లయితే జనవరి మాసంలో కొత్త సభ్యత్వాలను నమోదు చేసుకుందాం. ప్రతి ఒక్కరూ సభ్యత్వంలో తమ పాత్ర పోషించాలి. రాష్ట్రంలో 66 శాతం గెలిచాం అని ముఖ్యమంత్రి అబద్ధం ఆడుతున్నాడు. 66 శాతం ప్రజలు నీవైపు ఉంటే పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలతోని దమ్ముంటే రాజీనామా చేయించు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరామని గతంలో బాహటంగానే చెప్పారు, ఇప్పుడేమో కాంగ్రెస్లో చేరలేదంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను మరియు స్పీకర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుంది. ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.
ఇది కూడా ఒక బతుకేనా?, గడ్డి పోచలాంటి పదవి కోసం సూరు పట్టుకొని గబ్బిలం వేలాడినట్లు వేలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలలో ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజలు బిఆర్ఎస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బెదిరించినా రాజ్యాంగ బద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామాలకు వచ్చే నిధులు ఎవరు ఆపలేరు. రెండున్నర సంవత్సరాలు ఓపిక పట్టండి మల్లీ కేసీఆర్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుపుకుందాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.


