శ్రీశైలం-హైదరాబాద్ హైవే బంద్‌! | Srisailam-Hyderabad Highway Caves Due To Cyclone Montha | Sakshi
Sakshi News home page

Srisailam-Hyderabad Highway: శ్రీశైలం-హైదరాబాద్ హైవే బంద్‌!

Oct 30 2025 11:38 AM | Updated on Oct 30 2025 11:50 AM

Srisailam-Hyderabad Highway Caves Due To Cyclone Montha

సాక్షి, హైదరాబాద్‌: మోంథా తుపాను తెలంగాణపై విరుచుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌లోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు తెగిపోయింది. డిండి ప్రాజెక్టు అలుగుపోయడంతో జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో 765 హైవేపై హైదరాబాద్‌- శ్రీశైలం వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను అచ్చంపేట మండలంలోని హాజీపూర్ మీదుగా మళ్లించారు. వంగూరు మండలం చింతపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి.

రైల్వే ట్రాక్‌ల​పై వర్షపు నీరు..
మరోవైపు.. ఎడతెరపి లేని వర్షానికి ఉమ్మడి వరంగల్‌ జిల్లా చిగురుటాకులా వణికింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో భారీ వర్షం కురిసింది. గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో సుమారు రెండు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నీట మునిగింది. రైల్వే ట్రాక్‌పై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించగా, జేసీబీల సాయంతో అధికారులు 12 గంటలు శ్రమించి నీటిని తొలగించారు. ముందు జాగ్రత్తగా వేగం నియంత్రించి నెమ్మదిగా రైళ్ల రాకపోకలు సాగిస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం 
హుజూరాబాద్ డివిజన్‌లోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. హుజూరాబాద్‌లోని డిపో క్రాస్ రోడ్ వద్ద గల కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. హుస్నాబాద్‌లో పలు దుకాణాలు, ఇండ్లలోకి వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ వరద నీటితో కుంటను తలపించింది. భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా వరంగల్‌లో పలు ప్రాంతాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement