విమాన పైలట్ అన్నది అత్యుత్తమ కెరియర్‌లలో ఒకటి. పైలట్ అవ్వాలని చాలా మంది చిన్నప్పటి నుంచే కల కంటుంటారు. తాజాగా ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో (Indigo Crisis) పైలట్లకు, విమాన సిబ్బందికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం.. ఈ క్రమంలో వారికి జీత భత్యాలు ఎలా ఉంటాయన్న ఉత్సుకత చాలామందిలో ఉంటుంది.. ఇక్కడ తెలుసుకుందామా..
భారతదేశ విమానయాన రంగం ఆకాశాన్నే తాకుతున్నట్టుగా వృద్ధి చెందుతోంది. టూరిజం బూమ్, ఇతర కారణాలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ ఎప్పటికప్పుడు కొత్త విమానాలు ఆర్డర్ చేస్తున్నాయి. దీంతో పైలట్లు, క్యాబిన్ క్రూ సిబ్బందికి అసాధారణ డిమాండ్ ఏర్పడింది.
దేశంలో ప్రస్తుతం సుమారు 20 వేల మంది పైలట్లు, దాదాపు 35 వేల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు. మరో 10 సంవత్సరాల్లో 30,000 మంది పైలట్లు, 6.78 లక్షల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది అవసరమవుతారని అంతర్జాతీయ అవియేషన్ అంచనాలు సూచిస్తున్నాయి.
22,400 మంది అవసరం
విమానయాన శాఖ డేటా ప్రకారం.. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా మారింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి పెద్ద ఎయిర్‌లైన్‌లు రోజువారీ 2,000కి పైగా ఫ్లైట్‌లు నడుపుతున్నాయి. "2026 నాటికి 7,000 మంది కొత్త పైలట్లు, 2028 నాటికి మొత్తం 22,400 మంది అవసరం" అని ఇండియన్ ఎయిర్‌లైన్స్ అసోసియేషన్ (IAA) ఓ నివేదికలో పేర్కొంది.
ఆకర్షణీయ జీత భత్యాలు
పైలట్ల జీతభత్యాలు ఎయిర్‌లైన్ ప్రాతిపదికన, అనుభవం, విమాన రకం (A320, A321, ATR) వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ట్రైనీ పైలట్‌లు మొదటి సంవత్సరంలోనే నెలకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు జీతం పొందుతారు.
ఫస్ట్ ఆఫీసర్ (కో-పైలట్) పదవిలో ₹1.5 లక్షలు నుంచి ₹3 లక్షల వరకు, కెప్టెన్‌లకు ₹3 లక్షలు నుంచి ₹15 లక్షల వరకు (కొందరు ₹25 లక్షల వరకు) ఆదాయం ఉంటుంది.
సీనియర్ పైలట్‌లు రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.
జీతాలతో పాటు ఫ్లయింగ్ అలవెన్స్, నైట్ అలవెన్స్, స్టే అలవెన్స్, ఇన్స్యూరెన్స్, హోటల్ & ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీస్ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఇక క్యాబిన్ క్రూ సిబ్బంది విషయానికి వస్తే ఫ్రెషర్లకు జీతం రూ.25,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ రూ.1 లక్షకుపైగా చేరుకుంటుంది.
ఎయిర్ ఇండియాలో ఫ్రెషర్లు రూ.59,000 నుంచి రూ.61,000 వరకు పొందుతున్నారు. సీనియర్లు రూ.1.5 లక్షలు నుంచి రూ.2.5 లక్షల వరకు అందుకుంటున్నారు.
ఈ జీతాలతో పాటు, ఉచిత ఫ్లైట్ టికెట్లు, హౌసింగ్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్లు వంటి భత్యాలు ఉన్నాయి.


