దక్షిణాది మీడియా, వినోద పరిశ్రమలో జియోహాట్‌స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. మాతృ సంస్థ జియోస్టార్ (JioStar) రాబోయే ఐదేళ్లలో రూ.4,000 కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి దక్షిణాది క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు చెన్నైలో ఇటీవల జరిగిన ‘సౌత్ అన్‌బౌండ్ (South Unbound)’ అనే ఈవెంట్‌లో వివిధ 25 కొత్త ప్రసార ప్రకటనలను ఆవిష్కరించారు.
భారీ పెట్టుబడి లక్ష్యం ఏమిటి?
జియోహాట్‌స్టార్‌కు దక్షిణాది ప్రాంతం ఒక కీలక వృద్ధి కేంద్రంగా మారిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల వినియోగదారులతో పోలిస్తే దక్షిణాది వీక్షకులు తమ ప్లాట్‌ఫామ్‌పై 70% ఎక్కువ సమయం గడుపుతున్నారని, 50% ఎక్కువ కంటెంట్ విభాగాలను చూస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ను మరింత బలోపేతం చేయడానికి దక్షిణాది ప్రేక్షకులకు మరింత వైవిధ్యభరితమైన, నాణ్యత కలిగిన కంటెంట్‌ను అందించాలనే లక్ష్యంతో రూ.4,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలిపారు.
ఈ నిధులను రచయితలు, దర్శకులు, నూతన డిజిటల్ కథా రచయితల అభివృద్ధి కోసం శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, రైటింగ్ ల్యాబ్‌ల కోసం ఉపయోగించనున్నారు. కంటెంట్ నిర్మాణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక నిర్మాణ సంస్థలకు మద్దతు ఇచ్చేందుకు ఈ నిధులు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ చెప్పింది. దీని ద్వారా 1,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 15,000 పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
ఐపీఎల్ హక్కుల నష్టాన్ని భర్తీ చేస్తుందా?
జియోహాట్‌స్టార్ ఐపీఎల్ మీడియా హక్కులను కోల్పోవడం, ఆ తర్వాత దక్షిణాదిలో ఈ భారీ పెట్టుబడి ప్రకటనకు మధ్య ఉన్న సంబంధంపై మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, జియోహాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకులకు ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉద్దేశించిన కంటెంట్‌ను అందించాలని నిర్ణయించింది. ఐపీఎల్ అనేది క్రీడా విభాగానికి చెందింది. దక్షిణాదిలో ఓటీటీ వీక్షణలు తగ్గి, నిలుపుదల రేటు (Retention Rate) ఇప్పటికే ఎక్కువగా ఉన్నందున జియోహాట్‌స్టార్ ఈ పెట్టుబడిని కేవలం ఐపీఎల్ లోటును భర్తీ చేయడానికి కాకుండా ప్రాంతీయ మార్కెట్‌లో ప్రజలకు వినోదాన్ని పంచుతూ తాను ఆర్థికంగా వృద్ధి చెందే అంశంగా చూడాలని కొందరు చెబుతున్నారు. ప్రాంతీయ కంటెంట్ సృష్టికర్తలు, స్థానిక కథనాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచుకోవాలని కూడా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం


