5 కంపెనీలు లిస్టింగ్‌కు రెడీ | SEBI Approves IPOs for Five Companies | Sakshi
Sakshi News home page

5 కంపెనీలు లిస్టింగ్‌కు రెడీ

Dec 11 2025 6:35 AM | Updated on Dec 11 2025 6:35 AM

SEBI Approves IPOs for Five Companies

జాబితాలో మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ 

లీప్‌ ఇండియా, ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ 

టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ

ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డు నెలకొల్పే బాటలో ప్రైమరీ మార్కెట్లు పలు లిస్టింగ్‌లతో కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే సెంచరీ మార్క్‌కు చేరువైన ఐపీవోలు రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో 5 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. వివరాలు చూద్దాం..

న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్‌ ఇండియా, ఎల్‌డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ, స్కై అల్లాయ్స్‌ అండ్‌ పవర్‌ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్‌ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్‌లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్‌పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 

రూ. 2,400 కోట్లపై కన్ను 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా సప్లైచైన్‌ అసెట్‌ పూలింగ్‌ కంపెనీ లీప్‌ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో లిస్టింగ్‌ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచి్చంచనుంది.   

రూ. 1,000 కోట్లకు రెడీ 
శ్రీకార్‌ సీడ్స్‌ బ్రాండ్‌ కంపెనీ ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విత్తనాలుసహా.. సస్యరక్షణ సొల్యూషన్స్‌ సమకూర్చే తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. 

పీఈ సంస్థల వాటాలు 
పీఈ సంస్థలు టెమాసెక్, మోతీలాల్‌ ఓస్వాల్‌కు పెట్టుబడులున్న మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 1.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 99 కోట్లు కొత్త ఆర్‌అండ్‌డీ యూనిట్‌(ఎక్సలెన్స్‌ సెంటర్, ఆఫీస్‌ స్పేస్‌) ఏర్పాటుకు వెచి్చంచనుంది.  

కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటు 
కేటరింగ్, ఫుడ్‌ రిటైల్‌ చైన్‌ కంపెనీ ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.19 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటుతోపాటు, మెటీరియల్‌ అనుబంధ సంస్థ ఫుడ్‌లింక్‌ గ్లోబల్‌ రెస్టారెంట్స్‌ అండ్‌ కేటరింగ్‌ సర్వీసెస్‌ కొత్తగా నెలకొల్పనున్న క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్లకు వినియోగించనుంది. ఇండియా బిస్ట్రో, ఆర్ట్‌ ఆఫ్‌ దమ్, చైనా బిస్ట్రో తదితర బ్రాండ్లతో 30 క్యాజువల్‌ రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లను నిర్వహిస్తోంది. 

తాజా ఈక్విటీ, ఓఎఫ్‌ఎస్‌ 
ఐపీవోలో భాగంగా వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ సంస్థ కార్తికేయ కన్‌స్ట్రక్షన్స్‌ ఆఫర్‌ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది.  

రెండు కంపెనీల దరఖాస్తు 
    జాబితాలో స్టీమ్‌హౌస్‌ ఇండియా 
    సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్వెస్ట్‌ ట్రస్ట్‌ 
రవాణా సంబంధ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు చేపట్టే సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌) పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూనిట్ల జారీ ద్వారా రూ. 1,340 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 1,235 కోట్లు ఎస్‌ఆర్‌పీఎల్‌లో సెక్యూరిటీల కొనుగోలు, టీఈఎల్, జేఎస్‌ఈఎల్, ధోలా, డిబంగ్‌ తదితర ఎస్‌పీవీ ప్రాజెక్టులలో పెట్టుబడులు చేపట్టనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. దాదాపు 3,407 కిలోమీటర్ల పోర్ట్‌ఫోలియో(ఆస్తులు)ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,987 కోట్ల ఆదాయం, రూ. 418 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 

రూ. 425 కోట్లకు సై 
ఇండ్రస్టియల్‌ స్టీమ్, గ్యాస్‌ సరఫరా చేసే స్టీమ్‌హౌస్‌ ఇండియా ఐపీవోకు వీలుగా సెబీకి అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను జత చేసింది. జూలైలో గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో తాజాగా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 345 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా 425 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అంకలేశ్వర్, పనోలీ యూనిట్ల విస్తరణకు, దహేజ్‌లో కొత్త స్టీమ్‌ జనరేషన్‌ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. 2024–25లో రూ. 395 కోట్ల ఆదాయం, రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement