సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) స్టాక్ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కీలక చర్య తీసుకుంది. అవధూత్ సాథే ట్రేడింగ్ అకాడమీ (ఆస్టా) వ్యవస్థాపకుడు అవధూత్ సాథే, ఆస్టా సంస్థ, డైరెక్టర్ గౌరీ సాథేలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, వారి ఖాతాల్లో ఉన్న ఏకంగా రూ.546 కోట్లను జప్తు చేయాలని సెబీ ఆదేశించింది.
విద్య ముసుగులో..
రిటైల్ పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించి ఈ భారీ మొత్తాన్ని సేకరించడానికి ఆస్టా రిజిస్టర్ చేయని పెట్టుబడి సలహాదారుగా పనిచేసిందని సెబీ నిర్ధారించింది. ఆస్టా అందించిన విద్యా కోర్సుల పేరుతో నిర్దిష్ట స్టాక్ చిట్కాలు, లైవ్ ట్రేడింగ్ కాల్స్, ఎంట్రీ-ఎగ్జిట్ సూచనలు ఇవ్వడం ద్వారా ఈ ఆదాయం వచ్చిందని సెబీ తేల్చింది. ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో సెబీ దర్యాప్తు చేపట్టింది. వీడియోలు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా కంటెంట్, పేమెంట్ లేవాదేవీలు, కొంతమంది వ్యక్తుల సాక్ష్యాలను పరిశీలించిన సెబీ ఆస్టా కార్యకలాపాలు కేవలం విద్యా శిక్షణకు పరిమితం కాకుండా, ప్రత్యక్ష పెట్టుబడి సలహాగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఉదాహరణకు, ఒక లైవ్ సెషన్‌లో అవధూత్ సాథే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్‌ను నిర్దిష్ట ధరకు కొనుగోలు చేయమని, స్టాప్-లాస్, టార్గెట్‌తో సహా సూచించారు. దీన్ని సెబీ ఉత్తర్వుల్లో ఉటంకిస్తూ ‘ఇది విద్య కాదు, పెట్టుబడి సలహా’ అని స్పష్టంగా పేర్కొంది.
అధిక ఫీజులు, హామీ రాబడుల భ్రమ
ఆస్టా కౌన్సెలింగ్ బ్యాచ్‌ల పేరుతో ప్రైవేట్ వాట్సాప్ గ్రూపుల ద్వారా అధిక ఫీజులు చెల్లించిన వందలాది మంది సభ్యులకు రియల్‌టైమ్ ట్రేడింగ్ సూచనలు ఇచ్చింది. ఈ కోర్సుల ధర రూ.6.75 లక్షల వరకు ఉండగా, ఇవి కేవలం సైద్ధాంతిక పాఠాలకే కాకుండా రియల్‌టైమ్ సలహా కోసమేనని సెబీ గుర్తించింది. సంస్థ లాభదాయక ట్రేడ్ స్క్రీన్‌షాట్‌లు ప్రదర్శించి, నష్టాలను దాచిపెట్టి, అధిక రాబడుల హామీ భ్రమ కల్పించిందని సెబీ విమర్శించింది.
2024 ప్రారంభంలో అధికారిక హెచ్చరిక అందినా సాథే ఈ పద్ధతులను కొనసాగించి, కార్యకలాపాలను మరింత రహస్యంగా మార్చారని సెబీ తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది.
సెబీ ఆదేశాలు ఇవే..
సెక్యూరిటీస్ మార్కెట్‌ను రక్షించడానికి, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడటానికి సెబీ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. అవధూత్ సాథే, గౌరీ సాథే, ఆస్టా సంస్థపై సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తాత్కాలిక నిషేధిస్తున్నట్లు చెప్పింది. వీరు సెక్యూరిటీల కొనుగోలు-విక్రయాలు, సలహా కార్యకలాపాలు, లైవ్ ట్రేడింగ్ సెషన్లు నిర్వహించడంపై నిషేధం విధించింది. రూ.546 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల్లో ఉంచే వరకు వారి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. పూర్తి ఆర్థిక రికార్డులు, ఆస్తి వివరాలు, జీఎస్టీ ఫైలింగ్స్, కస్టమర్ జాబితాను సమర్పించాలని చెప్పింది. సెబీ ఈ కేసుపై విచారణ కొనసాగిస్తోంది. నోటీసులకు 21 రోజుల్లో అవధూత్ సాథే, ఇతరులు సమాధానం ఇవ్వాల్సి ఉంది.
రిటైలర్లు ఏం చేయాలంటే..
రిటైల్ పెట్టుబడిదారులు, వ్యాపారులు తమ డబ్బును రక్షించుకోవడానికి, ఆర్థిక నష్టాలను నివారించడానికి కొన్ని జాగ్రత్తులు తప్పకుండా పాటించాలి. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా స్టాక్ చిట్కాలు, ట్రేడింగ్ కాల్స్ లేదా నిర్దిష్ట స్టాక్‌లపై సలహా ఇస్తే వారు సెబీతో రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ (RIA) లేదా రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ (RA)గా నమోదు చేసుకున్నారో లేదో తప్పకుండా తనిఖీ చేయాలి.
సలహా ఇచ్చే వ్యక్తి/ సంస్థ సెబీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను (ఉదాహరణకు, INA0000XXXXXX లేదా INH0000XXXXXX) సెబీ అధికారిక వెబ్‌సైట్‌లో 'Intermediaries/Market Participants' విభాగంలో తనిఖీ చేయాలి. ట్రేడింగ్ కోర్సు లేదా విద్యా తరగతులు పేరుతో లైవ్ ట్రేడింగ్ కాల్స్, నిర్దిష్ట ట్రేడ్ సూచనలు ఇస్తే, వారు రిజిస్టర్ కాకపోయినా సెబీ దృష్టిలో అది పెట్టుబడి సలహాగానే పరిగణిస్తారు.
హామీ రాబడులు
స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి హామీ రాబడులు ఉండవు. ఏ వ్యక్తి అయినా ‘కచ్చితమైన లాభం’, ‘రిస్క్-ఫ్రీ స్ట్రాటజీ’ లేదా ‘మీ డబ్బు రెట్టింపు’ అవుతుందని హామీ ఇస్తే అది మోసమే. లాభాల స్క్రీన్‌షాట్‌లు, విజయం సాధించిన క్లయింట్ల కథనాలు మాత్రమే చూపించి నష్టాలను లేదా రిస్క్‌లను దాచిపెడితే అలాంటి వారి నుంచి దూరంగా ఉండండి.
ఇదీ చదవండి: ‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’


