విమానయాన రంగంలో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభం ఎంతటి గందరగోళానికి, నష్టానికి దారి తీసిందో తెలిసిందే. పైలట్ల విషయంలో రెస్ట్ రూల్స్ అమల్లోకి రావడం.. దాంతో కొరత తలెత్తి విమాన సర్వీసులు ఆగిపోవడం(కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలున్నాయ్).. చివరకు తాత్కాలికంగా ఆ రూల్స్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు ఆ ఫోకస్ భారతీయ రైల్వే వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా రైళ్లను నడిపే లొకో పైలట్లు (train drivers) తమకూ విశ్రాంతి అవసరమనే గళం వినిపించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కోట్లాది ప్రయాణికుల భద్రతను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ‘‘రైల్వేలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కానీ, మేం తీసుకునేది అతికొద్ది విశ్రాంతి. చేసేది 14 నుంచి 23 గంటలపాటు నిరంతరంగా పని. ఇలాంటి దీర్ఘకాలిక డ్యూటీలు అలసటను పెంచి, ఏకాగ్రతను తగ్గిస్తాయి. ఫలితంగా.. లక్షల మంది మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఎఫ్‌ఆర్‌ఎంఎస్(Fatigue Risk Management System) ఆధారంగా డ్యూటీ అవర్స్ పరిమితులు అమలు చేయాలి’’ అని లోకోపైలట్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం రైల్వేలో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా, రైళ్లను నడిపే పైలట్లపై ఒత్తిడి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కఠిన డ్యూటీ అవర్స్‌పై పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో మాత్రం రైల్వేలో అలాంటివేం లేకపోవడంతో వాళ్ల ఆందోళనను తీవ్ర తరం చేస్తోంది. ఒకవైపు భారతీయ రైల్వేస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు లోకో పైలట్లకు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల మానవ తప్పిదాలు జరిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిమాండ్లు:
భద్రతాపరమైన నియమాలు.. లోకో పైలట్లకు అలసటను తగ్గించే విధానాలు, నియమాలు అమలు చేయాలి.
రోస్టర్.. షిఫ్ట్‌లను శాస్త్రీయంగా, సమయపూర్వకంగా కేటాయించాలి.
వారంతాపు విశ్రాంతి.. వారానికి కనీసం ఒక విశ్రాంతి రోజు తప్పనిసరిగా ఇవ్వాలి.
పోలిక సబబేనా?..
విమానయానం.. రైల్వే.. ఈ రెండు రంగాల్లో పైలట్లు, లోకో పైలట్ల అలసట, దీర్ఘకాలిక డ్యూటీలు, విశ్రాంతి లేకపోవడం వల్ల ప్రయాణికుల విషయంలో భద్రతా సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మొదటి నుంచి పైలట్ల విశ్రాంతి నియమాలను పాటించకపోవడం వల్ల విమానయాన రంగంలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. కానీ, ఇదే సమస్య రైల్వేలోనూ ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతోందని ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ(All India Loco Running Staff Association) చెబుతోంది.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటారు. అదే ప్రైవేట్ కార్పొరేషన్లు (ఇండిగో వంటి సంస్థలు) భద్రతా నియమాలను పాటించకపోతే.. ప్రభుత్వం వారికి తలొగ్గుతుంది అని కొందరు లోకో పైలట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాలుగా..
రోజుకు 6 గంటల డ్యూటీ పరిమితి. ప్రతి డ్యూటీ తర్వాత 16 గంటల విశ్రాంతి. వారానికి ఒక కంపల్సరీ రెస్ట్.. డిమాండ్‌లను 1970 నుంచే ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ వినిపిస్తోంది. 80-90 మధ్య కాలంలో నిరంతర ఆందోళనలు జరిగాయి. కాస్త గ్యాప్ తర్వాత.. 2000 సంవత్సరం నుంచి మళ్లీ ఉద్యమాలు జరిగాయి. 2024 అక్టోబర్‌లో దేశవ్యాప్త నిరసన నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వేలాది లొకో పైలట్లు సమావేశమై, రైల్వే బోర్డుకు మెమోరాండం సమర్పించారు. అయినా చలనం లేకపోవడంతో.. ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
‘‘లొకో పైలట్ల ఆందోళనలు ప్రజల భద్రతకు సంబంధించిన కీలక హెచ్చరికగా భావించాలి. రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే కొత్త నియమాలు, విశ్రాంతి విధానాలు అమలు చేయకపోతే, రైళ్ల భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. విమానయాన రంగంలో జరిగిన సంక్షోభం తర్వాత, రైల్వేలోనూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడే చర్యలు అత్యవసరం’’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


