న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు 36 మందికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. జీవితంలో మర్చిపోలేని విషాదానికి గురైన వీరంతా నాలుగు దశాబ్ధాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని సీఎం గుప్తా పేర్కొన్నారు. ఇది కేవలం ఉద్యోగ కల్పనే కాదు, వారి ఆత్మగౌరవాన్ని, హక్కులను, గుర్తింపును పునరుద్ధరించడమేనని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
బాధిత కుటుంబాలకు పారదర్శక, సత్వర ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారని చెప్పారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1984లో అంగరక్షకుల కాల్పుల్లో చనిపోవడం తెల్సిందే. అనంతరం ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కుటుంబసభ్యులను కోల్పోయిన 19 మందికి ప్రభుత్వ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలిచి్చంది. తాజాగా నియామక పత్రాలిచి్చన వారితో కలిపితే ఇప్పటి వరకు 55 మందికి ఉద్యోగా లిచి్చనట్లయింది.


