
13 ఏళ్ల తర్వాత నియామకాలు
వేయి మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు
తెలంగాణ వచ్చాక ఆర్టీసీలో తొలి నియామకాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉద్యోగ నియామకాలు జరగబోతున్నాయి. వేయి మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆర్టీసీలో జరగబోతున్న తొలి నియామక ప్రక్రియ ఇదే కావటం విశేషం. చివరిసారిగా 2012లో డ్రైవర్, కండక్టర్లను నియమించారు. ఆ తర్వాత మళ్లీ నియామకాలు జరగలేదు.
ఉద్యోగ విరమణలతో భారీగా ఖాళీలు ఏర్పడినప్పటికీ, ఉన్న సిబ్బందితోనే ఆర్టీసీ నెట్టుకొస్తోంది. 2019లో ఒకేసారి ఏకంగా 2 వేల బస్సులను రద్దు చేయటం, పాత బస్సులను తుక్కుగా మార్చినప్పటికీ.. వాటి స్థానంలో చాలినన్ని కొత్త బస్సులు కొనకపోవటం తదితరాల వల్ల సమస్య తీవ్రత మరింత పెరగకుండా చూస్తూ వచ్చారు.
భారీగా పదవీ విరమణలు
సమీప భవిష్యత్తులో భారీగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. దీంతో డబుల్ డ్యూటీలు పెరిగి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ఇక మరింత భారం మోపితే పరిస్థితి అదుపు తప్పుతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీల భర్తీకి ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
గతేడాదే ఇందుకు అనుమతి వచ్చినప్పటికీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. గతంలో తనకు కావల్సిన సిబ్బందిని ఆర్టీసీనే సొంతంగా నియమించుకునేది. కానీ, ప్రభుత్వం దాన్ని మార్చి ప్రభుత్వ ఉద్యోగాల నియామక బోర్డులకు బాధ్యత అప్పగించింది. దీంతో డ్రైవర్లు, శ్రామిక్‌ల పోస్టుల భర్తీ ప్రక్రియ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు దక్కింది.
వారికే ఎక్కువ అవకాశం...
డ్రైవర్ల సంఖ్య భారీగా తగ్గిపోవటంతో ఇటీవల ఆర్టీసీ తాత్కాలిక పద్ధతిలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుంది. దాదాపు 1,100 మంది డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిలో గత నాలుగు నెలలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి నియామకాలకు నోటిఫికేషన్ రావటంతో వారు దరఖాస్తు చేయనున్నారు. నాలుగు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతున్న అనుభవం సంపాదించినందున వారికే ఎక్కువ అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పదో తరగతి విద్యార్హత ఉండటంతో, ఆ అర్హత లేని వారికి మాత్రం అవకాశం ఉండదు.
వీరితోనే సరి...
వాస్తవానికి ఆర్టీసీలో ఉన్న డ్రైవర్ ఖాళీలు వేయికి మించి ఉన్నాయి. కానీ భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. ఇప్పటికీ నగరంలో 225 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండగా, మరో రెండు నెలల్లో ఇంకో 275 బస్సులు రాబోతున్నాయి. పీఎం ఈ–డ్రైవ్ పథకం కింద వచ్చే మార్చి నుంచి క్రమంగా 2,800 బస్సులు హైదరాబాద్‌కు రానున్నాయి. జిల్లాల్లో కూడా 500 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.
అద్దె బస్సులకు వాటి యజమానులే డ్రైవర్లను సమకూర్చాల్సి ఉన్నందున, ఆర్టీసీకి డ్రైవర్ల అవసరం తగ్గుతుంది. దీంతో ఇప్పుడు తీసుకునే వేయి మందితోనే ఉన్న బస్సులను తిప్పనున్నారు. ఇక 1500 కండక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రతిపాదించినప్పటికీ, నోటిఫికేషన్‌లో వాటి ఊసు లేదు. ఇటీవల 500 మంది తాత్కాలిక కండక్టర్లను ఆర్టీసీ నియమించుకుంది. తదుపరి విడత కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు.
ఆర్టీసీలో ప్రస్తుతం మెకానిక్‌లకు కూడా కొరత ఉంది. ఉన్న శ్రామిక్‌లకు పదోన్నతి ఇవ్వటం ద్వారా మెకానిక్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పుడు 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచి్చనందున, వారు రాగానే ఉన్న శ్రామిక్‌లకు మెకానిక్‌లుగా పదోన్నతి ఇవ్వనున్నారు.