ఒకప్పుడు సరదాగా మొదలైన బెట్టింగ్ ఇప్పుడు అనేక మందికి వ్యసనంగా మారింది. అయితే కేవలం సాధారణ పౌరుల జీవితాలను మాత్రమే ఛిన్నాభిన్నం చేస్తోందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఈ మహమ్మరి కోరల్లో చిక్కుకుని పోలీస్ సిబ్బంది కూడా దారి తప్పుతున్నారు. అందుకు వరుసగా వెలుగుచూసిన ఉదంతాలే కారణం!
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో అప్పులపాలై.. సర్వం కోల్పోయి.. తన దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతకు ముందు.. ఈ వలయంలో చిక్కుకున్న ఓ అధికారి(అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్) దాని నుంచి బయటపడేందుకు ఏకంగా సర్వీస్ రివాల్వర్‌తో పాటు ఓ కేసులో రికవరీ బంగారాన్ని తాకట్టపెట్టాడనే అభియోగాల కింద విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ మధ్యలో..
నగరంలోని ఉప్పల్‌లో ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో పని చేసే ఓ యువ కానిస్టేబుల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఉన్న ఇంటిని అమ్మేసుకుని.. విధులకు దూరంగా ఉంటూ వస్తూ.. చివరకు ఒత్తిళ్ల నడుమ మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అలాగే ఆ మధ్య సంగారెడ్డి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేసిన ఓ కానిస్టేబుల్ పిస్టల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఈ భూతమే ఉందనే ప్రచారం నడిచింది.
చిన్న మొత్తాలతో ప్రారంభించిన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం.. ఆ తరువాత పెద్ద అప్పులకు దారితీస్తోంది. గేమ్‌లలో డబ్బులు కోల్పోయి, సహోద్యోగులు.. స్నేహితుల వద్ద అప్పులు చేసి తిరిగి ఇవ్వలేని స్థితికి పోలీసు సిబ్బంది చేరుకుంటున్నారు. అప్పులు తీర్చమని ఒత్తిడి పెరగడంతో చివరకు.. మానసికంగా తీవ్రంగా కలత చెంది తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
బెట్టింగ్ మహమ్మారి కోరల్లో పోలీసులు.. అందునా యువ సిబ్బంది చిక్కుకుపోతుండడం ఇటు ఉన్నతాధికారులకూ ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉండి.. అందునా టెక్నాలజీపై పట్టుఉన్న సిబ్బంది కూడా ఆ వ్యసనంలో మునిగిపోతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని అంటున్నారు. దీన్ని అత్యవసరంగా కట్టడి చేసేందుకు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం పోలీస్ శాఖలో బలంగా వినిపిస్తోంది.


