న్యూఢిల్లీ: పంజాబ్‌లోని తర్న్ తరన్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్జిత్ సింగ్ సంధు తరపున ప్రచారం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని, పలు విమర్శలు గుప్పించారు. ‘ఆప్’ తమ పాలనలో ఢిల్లీని నాశనం చేసినట్లే, ఇప్పుడు పంజాబ్‌ను కూడా సర్వ నాశనం చేస్తోందని ఆరోపించారు.
ప్రచార సభలో రేఖా గుప్తా మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు గురించి కాదని, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిపైనేనని ఆమె అన్నారు. పంజాబ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల దుర్వినియోగం, శాంతిభద్రతల సమస్యలు, రుణ సమస్యల్లో మునిగిపోయిందని ఆరోపించారు. నవంబర్ 11న తర్న్ తరన్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్జీత్ సింగ్ సంధుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.
పంజాబ్ రాష్ట్రమంతా మాదకద్రవ్యాల వ్యసనంలో మునిగిందని ఆరోపించారు. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పు భారం ప్రజలపై పడిందని రేఖా గుప్తా అన్నారు. ఈ ప్రచారానికి ముందు ఆమె తర్న్ తరన్‌లోని దర్బార్ సాహిబ్‌లో పూజలు చేసి, రాష్ట్రంలో శాంతి, సామరస్యం శ్రేయస్సు కోసం ప్రార్థించారు. అనంతరం ఆమె ఠాకూర్ద్వారా ఆలయాన్ని సందర్శించి, అక్కడున్న భక్తులతో సంభాషించారు. ఢిల్లీ క్యాబినెట్ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఆమె వెంట పర్యటించారు.
ఇది కూడా చదవండి: ‘హెచ్చరించినా పట్టించుకోలేదు’.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు


