న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తాజాగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్(ఏటీసీ గిల్డ్ ఇండియా) తీవ్రంగా స్పందించింది. ఈ సమస్యలపై గత జూలైలోనే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి తెలియజేశామని, సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయవలసిన అవసరం గురించి ముందుగానే హెచ్చరించామని ఏటీసీ గిల్డ్ ఇండియా పేర్కొంది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం తలెత్తిన సిస్టమ్ వైఫల్యాన్ని నివారించవచ్చని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సంస్థ ఏటీసీ గిల్డ్ తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఏటీసీ అప్‌గ్రేడ్‌ల ఆవశ్యకత గురించి ముందుగానే తెలియజేశారని, అయితే అధికారులు వారి సూచనలను స్వీకరించి, చర్యలు చేపట్టలేదని ఆరోపించింది. అహ్మదాబాద్‌లో 260 మందిని బలిగొన్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాదం తర్వాత జూలై 8న ఎంపీలకు కూడా లేఖ రాశామని, ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలను సమీక్షించి, కాలానుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం చాలా అవసరమని తెలియజెప్పామని గిల్డ్ వివరించింది.
భారతదేశంలోని ఆటోమేషన్ వ్యవస్థ యూరప్‌లోని యూరోకంట్రోల్, యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) మాదిరిగా ఉండాలని ఆ లేఖలో గిల్డ్ పేర్కొంది. ఈ దేశాలలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఏఐ)తో తలెత్తే ముప్పును గుర్తించడం, రియల్-టైమ్ డేటా షేరింగ్ కలిగి ఉన్నాయని గిల్డ్ తెలిపింది. ఇటువంటి భద్రతా సమస్యలను ఏఏఐ ముందు పలుమార్లు లేవనెత్తామని, అయితే దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గిల్డ్ ఆరోపించింది.
ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సర్వర్ శుక్రవారం పనిచేయలేదు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎస్‌ఎస్)లో సాంకేతిక లోపం కారణంగా విమాన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఇది 800కు పైగా విమానాలను ప్రభావితం చేసిందని అధికారులు తెలిపారు. దీంతో పలు విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య ప్రభావం అంతర్జాతీయ విమాన రాకపోకలకు కూడా పడింది.
ఇది కూడా చదవండి: డిసెంబర్ 1 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు


