నెల నుంచి ఏడు రోజులకే పరిమితమైన వైనం
అనేక కేసుల దర్యాప్తులో ఇదే ప్రధాన అడ్డంకి
‘ఆ రెండు’ రకాల వాటిపై ఆశలు పెట్టకోవద్దు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉగ్రవాద పదఘట్టనలు వినిపిస్తున్నాయి.. కొన్నింటి ఛాయలు నగరంలోనూ కనిపిస్తున్నాయి.. పోలీసులు, నిఘా వర్గాలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటున్నాయి... హైదరాబాద్ నగరానికి సాఫ్ట్ టార్గెట్ అనే పేరు ఎలానూ ఉంది... ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగానికి సీసీ కెమెరాల ఫీడ్ స్టోరేజ్ బ్యాకప్ సామర్థ్యం తగ్గడం కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలకు సంబంధించిన ఫీడ్ గతంలో నెల రోజుల పాటు సర్వర్ బ్యాకప్ ఉండేది. ఇది ప్రస్తుతం వారానికి తగ్గడం అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది.
పట్టించుకోని ఉన్నతాధికారులు
ఇటీవల కాలంలో పోలీసింగ్ పూర్తిగా మారిపోయింది. క్షేత్రస్థాయి నిఘాను వదిలేసిన అధికారులు సాకేంతిక అంశాలపై ఆధారపడిపోయారు. ఈ కారణంగానే ఎక్కడ, ఏ నేరం జరిగినా దర్యాప్తు అధికారుల దృష్టి నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్, ఘటనాస్థలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలపై ఉంటోంది. కేవలం సీసీ కెమెరాల ఆధారంగా కొలిక్కి వచి్చన కేసులు అనేకం ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏటా పోలీసులు పట్టుకుంటున్న నేరగాళ్లు, నిందితుల్లో 70 నుంచి 80 శాతం మందిని గుర్తించడానికి సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడే ఆధారం అవుతోంది. ఆయా కేసుల్లో పరోక్షంగా సెల్‌ఫోన్ వివరాలు సైతం ఉపకరించినా... ప్రధానంగా సీసీ కెమెరాల ఫీడే ఉపకరిస్తోంది.
పని చేయని పాసివ్ బ్యాకప్...
నగరంలోని సీసీ కెమెరాల పరిస్థితి ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా మారింది. సీసీ కెమెరాల సంఖ్యలో దేశంలో ప్రథమ స్థానం, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థానంలో ఉన్నామని అనేక సర్వేలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం నగర వ్యాప్తంగా మూడు రకాల కెమెరాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటితో పాటు స్థానికంగా వ్యాపారులు, సంఘాలు పెట్టిన కమ్యూనిటీ కెమెరాలు, ఎవరికి వారుగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ ప్రాజెక్టు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఉన్నవి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు. తొలినాళ్లల్లో వీటి ఫీడ్‌కు 30 రోజుల బ్యాకప్ సదుపాయం కల్పించారు. వారం రోజులు యాక్టివ్ విధానంలో నేరుగా, మరో 23 రోజుల ఫీడ్ పాసివ్ విధానంలో అంతర్గతంగా భద్రపరిచే వారు.
వాటిపై పూర్తిగా ఆధారపడలేం..
దర్యాప్తు అధికారులు యాక్టివ్ ఫీడ్‌ను తక్షణం, పాసివ్ ఫీడ్‌ను టెక్నికల్ వ్యక్తుల సహకారంతో తీసుకునే అవకాశం కల్పించారు. అయితే కొన్నాళ్లుగా సర్వర్‌లో ఉండే పాసివ్ ఫీడ్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రావట్లేదు. దీంతో కేవలం యాక్టివ్ ఫీడ్‌గా భావించే ఏడు రోజుల బ్యాకప్‌పైనే ఆధారపడుతున్నారు. ఏదైనా నేరం వెలుగులోకి రావడానికి వారం కంటే ఎక్కవ సమయం పడితే మాత్రం ప్రభుత్వ కెమెరాల నుంచి ఆధారాలు సేకరించడం సాధ్యం కాదు. కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇవి కీలక ప్రాంతాల్లో లేకపోవడం, ఉన్న వాటిలోనూ అత్యధికం మరమ్మతులకు గురి కావడంతో ఫీడ్ లభించే వరకు గ్యారంటీ లేదు. ఈ కారణంగానే కొన్ని కేసులు కొలిక్కి రాకుండా మిగిలిపోతున్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయం దృష్టి పెట్టి, బ్యాకప్ కనీసం 30 రోజులు కచి్చతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులు కోరుతున్నారు.


