ఎస్టీపీల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి,సిటీ బ్యూరో: కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనుల్లో వేగం పెంచి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అన్నారు.ఈ మేరకు గురువారం ఆయన ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అమృత్– 2.0 పథకంలో భాగంగా నిర్మించనున్న 39 ఎస్టీపీల పనుల పురోగతిపై ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఓఆర్‌ఆర్ పరిధిలో సుమారు రూ.3,849.10 కోట్ల వ్యయంతో రెండు ప్యాకేజీ – 2 కింద నిర్మిస్తున్న ఎస్టీపీల పనుల పురోగతి గురించి అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ అనుమతులు లభించిన స్థలాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి వెంటనే ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు ఉన్న ప్రాంతాల్లో త్వరగా సమస్యలు పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రతి ఎస్టీపీకి సంబంధించి 15 రోజులకు ఒకసారి చేయాల్సిన పనులపై చెక్ లిస్ట్ రూపొందించుకుని, గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. వాటి వివరాలు జలమండలి అధికారుల వద్ద, సైట్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.
భూ వివాదాలుంటే...
భూ వివాదాలు ఉన్న ప్రాంతాల్లో కలెక్టర్‌లతో సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్టేట్ ఆఫీసర్‌కు సూచించారు. మరోవైపు భూ వివాదాలు ఉన్న ప్రాంత ఎస్టీపీల నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా భూమిని గుర్తించాలన్నారు. వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. స్థలాభావం ఉంటే తక్కువ స్థలంలో ఎక్కువ సామర్థ్యంతో నిర్మించే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. పనులు మొదలు పెట్టినప్పటినుంచి తుదివరకు ఎస్టీపీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి టైం లైన్లను నమోదు చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్టులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి


