కేంద్ర మైనింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ నిషేధించింది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాలకు కొత్త మైనింగ్ లీజులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతులివ్వకూడదని పేర్కొంటూ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం మొత్తం అరావళ్లి శ్రేణికి సమానంగా వర్తిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ సదరు ప్రకటనలో పేర్కొంది.
అరావళి పర్యతాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటిగా భావిస్తారు. ఇవి ఢిల్లీ నుంచి గుజరాత్ వరకూ సూమారు 670 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఇవి వాయు కాలుష్యాన్ని తగ్గించంతో పాటు నీటి నిల్వలను కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ పర్వతాల్లో జరిగే మైనింగ్ వల్ల జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు.
తాజాగా.. ఇక్కడి మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నవంబర్ 20 న కీలక తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న ప్రాంతంలో భూమట్టానికి 100 మీటర్లు సూమారు 328 అడుగులు ఎత్తు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారని తీర్పు చెప్పింది. సుస్థిర మైనింగ్ నిర్వహణ ప్రణాళిక సిద్దమయ్యే వరకూ అక్కడ ఏలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టవద్దని తెలిపింది. ఈ విషయమై ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆర్డర్ ఇచ్చింది.
అయితే సుప్రీం కోర్టు 100 మీటర్ల ఎత్తైన పర్వాతాలనే ఆరావళిగా పరిగణించడాన్ని పర్యావరణ వేత్తలు తప్పుబట్టారు. ఆరావళి పర్వతాల్లో దాదాపు 91శాతం పర్వత శ్రేణులు 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోనే ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రాంతమంతా చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 100 మీటర్ల నిబంధనపై గుజరాత్‌లోని ప్రజలు నిరసన తెలిపారు.
అయితే తాజా నివేదికలు ఆరావళి పర్వతాలు క్రమంగా కోతకు గురవుతున్నాయని తెలుపుతున్నాయి. వృక్షసంపద దాదాపు మూడింట ఒక వంతు తగ్గిందని.. దశాబ్దం కాలంలోపే మూడువేల కిలోమీటర్లకు పైగా అటవీప్రాంతం కోతకు గురైందని సర్వేలు పేర్కొంటున్నాయి. దీంతో పాటు గిరిజన, ఆదివాసీల జీవనాధారంపైనా ప్రతికూల ప్రభావం పడే పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం మొదలైంది. ఇటు సోషల్ మీడియాలోనూ సేవ్ ఆరావళి ట్రెండింగ్‌గా నడిచింది. పరిస్థితులు తీవ్రతరం అయ్యేలా కనిపించడంతో.. అక్కడ నూతన మైనింగ్‌ను రద్దు చేస్తూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.


