సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌పై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణకు ఆదేశించింది.
ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.


