ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నగరంలో ఇన్ని రోజుల పాటు విధించిన కఠిన నిబంధనలను(GRAP-4) ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాయు నాణ్యత కొంత మెరుగుపడిన నేపథ్యంలో నిబంధనలు ఎత్తి వేస్తున్నామని.. పరిస్థితులు పునరావృతం అయితే మళ్లీ విధించక తప్పదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఢిల్లీలో గత కొద్ది రోజులుగా వాయకాలుష్యం తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నెల 13 త తేదీన వాయునాణ్యత తీవ్ర ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటడంతో గ్రాఫ్-4 కింద కఠిన ఆంక్షలను ప్రభుత్వం విధించింది. నర్సరీ నుండి ఐదవతరగతి వరకూ పాఠశాలలను మూసివేసింది. ఆపైతరగతులకు హైబ్రీడ్ మోడ్ ( ఆన్‌లైన్‌లో) క్లాసులు నిర్వహించాలని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి అని తెలిపింది.
అయితే బుధవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 271గా నమోదవడంతో కఠిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే సాధారణ ఆంక్లలు కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని అరికట్టేలా తగిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఇది వరకే పలుమార్లు హెచ్చరించింది. కాలుష్యాన్ని నియంత్రించేలా తగిన ప్రణాళిక రూపొందించాలని తెలిపింది.


