
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన సైబర్ ట్రక్ ఎలక్ట్రిక్ కార్లకు రీకాల్ ప్రకటించినట్లు ప్రకటించింది. ఈ ప్రభావం 63,619 వాహనాలను ప్రభావితం చేస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ లైట్లను చాలా ప్రకాశవంతంగా చేసే సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ రీకాల్ ప్రకటించడం జరిగిందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ సమస్య ఎదురుగా వచ్చే డ్రైవర్ల దృష్టిని దెబ్బతీసే అవకాశం ఉంది.
2023 నవంబర్ 13 నుంచి 2025 అక్టోబర్ 11 మధ్య తయారైన సైబర్ ట్రక్కులలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్లలోని సమస్యను కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడంతో సమస్యను పరిష్కరించవచ్చని టెస్లా వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక టెస్టులో ఈ సమస్య బయటపడినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు టెస్లా సైబర్ ట్రక్ వినియోగదారుల నుంచి.. ఈ సమస్యకు సంబంధించిన ఫిర్యాదులు అందలేదని టెస్లా పేర్కొంది.
ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి
టెస్లా తన సైబర్ ట్రక్ కార్లకు రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2025లో కూడా 46,000 కంటే ఎక్కువ వాహనాలకు రీకాల్ జారీ చేసింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. ఇప్పుడు మరోమారు.. సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా రీకాల్ ప్రకటించింది.