ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొత్తగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ9ఎస్‌ని ప్రవేశపెట్టింది. ఈ సెవెన్ సీటర్ ధర రూ. 19.95 లక్షల నుంచి రూ. 29.45 లక్షల వరకు (ఎక్స్–షోరూం) ఉంటుంది. 2027, 2028 క్యాలెండర్ సంవత్సరాల నాటికి తమ మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటాని 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజూరికర్ వివరించారు.
ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరుకల్లా ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 8,000 ఈవీల స్థాయికి పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రతినెలా 4,000–5,000 ఈవీలను విక్రయిస్తుండగా, దీన్ని 7,000కు పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయన్నారు. గత ఏడు నెలల్లో 30,000 పైగా ఈవీలను (బీఈ 6, ఎక్స్‌ఈవీ 9) విక్రయించామని, రూ. 8,000 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు.
2027 కల్లా 1,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమ బీఈ6 వాహనాల తయారీకి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీము కోసం దరఖాస్తు చేసుకుంటున్నామని రాజేష్ చెప్పారు.
వచ్చే ఏడాది జనవరి 14 సంక్రాంతి నుంచి ఎక్స్‌ఈవీ9ఎస్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా కంపెనీ తెలిపింది. జనవరి 23 నుంచి డెలివరీలు మొదలవుతాయని వెల్లడించింది.
ఈ ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు 59 kWh (కిలోవాట్ హవర్), 70 kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. 175 కిలోవాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
కంపెనీ ప్రకారం.. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వేరియంట్లను బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 521 కిలోమీటర్ల నుంచి 679 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది. వీటిలో 79 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌కు గరిష్ఠంగా 679 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఇక ఈ 7 సీటర్ ఎక్స్‌ఈవీలో 527 లీటర్ల బూట్ స్పేస్, డ్యాష్ బోర్డుపై మూడు డిజిటల్ స్క్రీన్లు, రెండో వరుసలో ప్రయాణికుల కోసం రెండు అదనపు స్క్రీన్లు ఇచ్చారు. ఏడు ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఏడీఏఎస్ వ్యవస్థ, ఆటో పార్కింగ్, డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


