పేటీఎం ఫౌండర్ & సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఎట్టకేలకు టెస్లా కారును డెలివరీ చేసుకున్నారు. మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ & క్రికెటర్ రోహిత్ శర్మ తరువాత ఈ కారును కొనుగోలు చేసిన మూడో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.
నిజానికి 2016లో, టెస్లా భారతదేశంలో తన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ 'మోడల్ 3' కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో బుక్ చేసుకున్నవారిలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. అయితే చాలాకాలం ఎదురు చూసినప్పటికీ.. కంపెనీ ఈ కారును మన దేశంలో లాంచ్ చేయలేదు. దీంతో సంస్థ బుక్ చేసుకున్నవారందరీ.. డబ్బును రీఫండ్ చేసింది.
టెస్లా కంపెనీ మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయలేదు, కానీ భారతదేశంలో మోడల్ వై లాంచ్ చేసింది. దీనిని చైనా నుంచి దిగుమతి చేసుకుని ఇండియాలో విక్రయిస్తోంది. టెస్లా ఇప్పటికే ముంబైలో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది, తరువాత ఢిల్లీలో ఒకటి, గురుగ్రామ్‌లో మరొకటి ప్లాన్ చేసింది.
టెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్‌పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్‌పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్‌లు దాదాపు 295 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం.


