ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.
న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్‌ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.
డిజిటలైజేషన్, ఉద్యోగాలు
కొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్‌వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్‌వర్క్‌లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.
అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.
ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం


