సాక్షి, విజయవాడ: తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్వాసితుల ఉద్యోగ కల్పనపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములు తీసుకుంది. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇవ్వకపోవడంతో నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు.
నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కి వెళ్లింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చబొమంటే కుదరదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాల వ్యవధిలోపే నెరవేర్చాలి. ప్రభుత్వం సాంకేతిక, అర్థంలేని కారణాలు సాకుగా చెప్పటానికి వీల్లేదు. నిర్వాసితుల కోసం తెచ్చిన పథకాన్ని అమలు చేయాల్సిందే. నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది
..భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిందే. లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. తెలుగు గంగ భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉత్తర్వులు సబబే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోం’’ అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది.


