ఒకే చోట రిటైల్, డెలివరీ, ఆఫ్టర్ సేల్స్ సరీ్వసులు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత్‌లో తమ తొలి టెస్లా సెంటర్‌ను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. రిటైల్, ఆఫ్టర్–సేల్స్ సర్వీస్, డెలివరీ, చార్జింగ్‌లాంటి ప్రధాన సేవలన్నింటినీ ఒకే చోట అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారత్‌లో వివిధ రకాల కస్టమర్ల లైఫ్‌స్టయిల్స్‌కి అనుగుణంగా చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్ తెలిపారు.
పెద్ద ఎత్తున సూపర్‌చార్జింగ్ సదుపాయాలతో పాటు కస్టమర్లకు హోమ్–చార్జింగ్ సొల్యూషన్స్‌ని కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల పైగా టెస్లా కార్ల విక్రయాలు, 3.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదపడ్డాయని ఆయన తెలిపారు. టెస్లా భారత్‌లో విక్రయించే మోడల్ వై కారు ధర రూ. 59.89 లక్షలుగా ఉంది.


