దేశ ఆవిష్కరణల విభాగంలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐఐటీ బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(SINE) దేశంలోనే మొట్టమొదటి ఇంక్యుబేటర్ లింక్డ్ డీప్ టెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించింది. ‘వై-పాయింట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’గా పిలువబడే ఈ ఫండ్‌ను మొత్తం రూ.250 కోట్ల పరిమాణంతో ప్రారంభ దశలో ఉన్న డీప్ టెక్ స్టార్టప్‌లకు క్యాపిటల్‌ను అందించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
దీని ద్వారా ఐఐటీ బాంబే దేశంలో తన సొంత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను నిర్వహించే మొదటి అకడమిక్-అనుబంధ టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించింది. హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు ఇంక్యుబేషన్, మెంటార్‌షిప్ సేవలు అందిస్తున్న ఎస్‌ఐఎన్‌ఈకు ఈ ఫండ్ ఎంతో తోడ్పడుతుందని ఐఐటీ బాంబే తెలిపింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ నిధి దాదాపు 25 నుంచి 30 స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ఒక్కో స్టార్టప్‌కు గరిష్టంగా రూ.15 కోట్ల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.
విస్తృత రంగాలకు మద్దతు
రొబోటిక్స్, మెటీరియల్ సైన్సెస్, అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), స్పేస్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ వంటి కీలక డీప్ టెక్ రంగాల్లో పనిచేసే స్టార్టప్‌లకు వై-పాయింట్ ఫండ్ మద్దతు అందిస్తుంది. ముఖ్యంగా ఐఐటీ బాంబే రిసెర్చ్ ఎన్విరాన్‌మెంట్, టెక్ ల్యాబ్‌లు, వ్యవస్థాపక నెట్‌వర్క్‌ల నుంచి ఉద్భవించే కంపెనీలకు ఇది చేదోడుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇతర ప్రీమియర్ అకడమిక్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వచ్చే డీప్ టెక్ స్టార్టప్‌లకు కూడా ప్రోత్సాహం అందిస్తుంది.
ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ


