టెక్ పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధ(ఏఐ) కాదని, కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు అవసరానికి మించి భారీగా ఉద్యోగులను నియమించుకోవడమేనని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ స్పష్టం చేశారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉద్యోగ కోతలను సహజ దిద్దుబాటు(Natural Correction)గా అభివర్ణించారు.
అతిగా నియామకాలు..
1990 నుంచి ఐబీఎంలో వివిధ విభాగాలకు నాయకత్వ పాత్రలు నిర్వహిస్తున్న కృష్ణ 2020 నుంచి 2023 మధ్య చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బంది సంఖ్యను 30% నుంచి 100% వరకు వేగంగా పెంచాయని వివరించారు. దాంతో కొంత సహజ దిద్దుబాటు జరగబోతోందని చెప్పారు.
ఈ ఏడాది ఐబీఎం తన ప్రపంచ శ్రామిక శక్తిలో వేలాది ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ తొలగింపులు ఏఐ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ వంటి వేగంగా వృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి సారించే ప్రయత్నంలో భాగంగా ఉన్నాయని తెలిపింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ తొలగింపులు ఐబీఎం 2,70,000 ప్రపంచ శ్రామిక శక్తిలో సింగిల్ డిజిట్ శాతంగా ఉంటాయని అంచనా వేసింది. కంపెనీ ప్రస్తుతం ఏఐ హైబ్రిడ్ క్లౌడ్ వంటి అధిక లాభదాయకత గల వ్యాపారాలపై పెట్టుబడులను పెంచుతోంది.
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం
ఉద్యోగాలపై ఏఐ దీర్ఘకాలిక ప్రభావం గురించి అడిగినప్పుడు, కొంతమేర ఉద్యోగ స్థానభ్రంశం (Job Displacement) ఉంటుందని కృష్ణ అంగీకరించారు. అయితే అది తీవ్రంగా ఉండదని అన్నారు. ‘రాబోయే రెండేళ్లలో మొత్తం యూఎస్ ఉపాధి పూల్‌లో 10 శాతం వరకు ఉద్యోగ స్థానభ్రంశం ఉండవచ్చు’ అని అంచనా వేశారు. ఈ ప్రభావం కొన్ని విభాగాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుందని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ కేవలం ఎంట్రీ లెవల్ శ్రమను తగ్గించడానికి మాత్రమే అనుసరించే విధానం అన్నారు. ఏఐ ఉత్పాదకతను పెంచుతున్నందున కంపెనీలు కొత్త రకాల పాత్రల్లో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయని కృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: యూఎస్‌లో చదువుకు రూ.10 కోట్లు!


