అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ పతనం (డెప్రిసియేషన్) తీవ్ర రూపం దాల్చింది. నేడు మార్కెట్లో ఒక డాలర్ విలువ సుమారు రూ.90.3గా నమోదైంది. దాంతో ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 4.83% మేర క్షీణించినట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా అంతర్జాతీయ విద్యా ఖర్చులపై దీర్ఘకాలిక ప్రణాళిక గురించి భారతీయ కుటుంబాలను హెచ్చరించారు.
రూపాయి విలువ 90 మార్కును దాటిన తర్వాత తన ఎక్స్ ఖాతాలో కరెన్సీ పతనం ప్రభావాన్ని వివరించారు. ముఖ్యంగా విదేశాల్లో తమ పిల్లల చదువుల కోసం చూస్తున్న లక్షలాది భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఇది మరింత ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు.
యూఎస్ డిగ్రీకి రూ.10 కోట్ల కార్పస్ ఎందుకు?
మే నెలలో తాను పోస్ట్ చేసిన ఒక విశ్లేషణను గుప్తా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ‘గతంలో యూఎస్ ఎడ్యుకేషన్ కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని చెప్పినప్పుడు ఈ సంఖ్యపై చాలా సందేశాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు రూపాయి 90కి చేరుకున్న తర్వాత ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ఆ పాత పోస్ట్‌లో ఆమె తన చిన్న కుమారుడు యూఎస్‌లోని డిగ్రీ చేయడం కోసం రూ.8-10 కోట్ల కార్పస్ (పెట్టుబడి నిధి) లక్ష్యంగా పెట్టుకోవడానికి గల కారణాలను వివరించారు.
‘ఈరోజు సుమారు రూ.2.5 కోట్లు ఖర్చవుతున్న యూఎస్ డిగ్రీ 16 సంవత్సరాల్లో దాదాపు రూ.10 కోట్లకు పెరుగుతుంది’ అని ఆమె లెక్కలను పంచుకున్నారు. ఇక్కడ కేవలం దేశీయ ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) ప్రభావాన్ని మాత్రమే కాకుండా, ఏటా 2-4% చొప్పున జరిగే కరెన్సీ డెప్రిసియేషన్‌ను కూడా లెక్కించాలని ఆమె సూచించారు. దేశీయ ఎగుమతులకు మద్దతు ఇవ్వడానికి పోటీ అవసరం కాబట్టి దీర్ఘకాలంలో కరెన్సీ తగ్గుదలను పరిగణించడం సురక్షితమైన ప్రణాళిక అని ఆమె చెప్పారు.
విదేశీ ఆస్తుల్లో డైవర్సిఫికేషన్
అంతర్జాతీయ ఆస్తుల్లో వైవిధ్యీకరణ ఉండాలని రాధికా గుప్తా సిఫారసు చేశారు. విదేశీ కరెన్సీలో ఖర్చు చేయబోయే కుటుంబాలకు తమ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆ కరెన్సీకి లింక్ అయిన ఆస్తుల్లో ఉంచడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చని తెలిపారు. అయితే, ఈ వైవిధ్యీకరణకు అడ్డంకిగా ఉన్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) పరిమితుల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్ పరిమితులు చాలా మంది భారతీయులకు విదేశీ మార్కెట్లలో పెట్టుబడులను కష్టతరం చేస్తున్నాయని ఆమె విమర్శించారు.
గిఫ్ట్ సిటీ ద్వారా కొత్త మార్గాలు
ఈ పరిమితులకు త్వరలోనే పరిష్కారం దొరికే అవకాశం ఉందని గుప్తా సూచించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఆ సమస్యను పరిష్కరించవచ్చని చెప్పారు. గుజరాత్‌లోని గ్లోబల్ ఇన్‌ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిటీ (గిఫ్ట్ సిటీ) అనేది ఎల్‌ఆర్‌ఎస్ పరిమితులకు లోబడకుండా మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: 20 ఏళ్లలో డబ్బు కోసం నో వర్క్!


