తల్లులకు ఇంటర్ హాస్టల్ విద్యార్థుల ఫోన్లు
విద్యార్థుల్లో పెరిగిన మానసిక ఒత్తిడి
ర్యాంకులే టార్గెట్‌గా సాగుతున్న బోధన
ఇక ఇళ్లకు పంపబోమంటూ కాలేజీల కబురు
కాలేజీల తీరుపై ప్రత్యేక దృష్టి పెడతామంటున్న బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మందిలో పరీక్షల భయం కనిపిస్తోంది. ‘మమ్మీ.. భయమేస్తోందే..’అంటూ ఇంటర్ హాస్టల్ విద్యార్థులు తల్లులకు ఫోన్లు చేసి వాపోతున్నారు. జిల్లా ఇంటర్ అధికారులు ఈ విషయాన్ని ఇటీవల బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాలేజీల్లో ఒక్కసారిగా బోధన సమయం పెరగడం.. అంతర్గత పరీక్షలు ఎక్కువ నిర్వహించాలనే ఆలోచన విద్యార్థుల భయానికి కారణంగా పేర్కొంటున్నారు.
దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బోధన సమయాన్ని ఎక్కువ చేశాయి. ఇంటర్ సిలబస్‌తోపాటు జేఈఈ, ఈఏపీసెట్, నీట్ వంటి పరీక్షల శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోజువారీ, వారాంతపు, నెలవారీ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో సుమారు 90 వేల మందే ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు.
ఇక ఇంటికి పంపలేం
పరీక్షలయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. ‘మీ వాడు మేథ్స్‌లో వీక్‌గా ఉన్నాడు. సెక్షన్ మారుస్తున్నాం’అని చెప్పే కాలేజీలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ‘చదవడం లేదా?.. ఇలా అయితే ఎలా’అంటూ నిలదీస్తున్నారు. ఒక్కసారిగా కట్టడి చేయడం, కఠిన నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు భయపడుతున్నారు.
ప్రైవేటు హాస్టళ్లలో సమయ పాలన మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకూ స్టడీ అవర్స్ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటివరకు క్లాస్ రూంలో చెప్పిన పాఠాలకు భిన్నంగా షార్ట్‌కట్ పేరుతో బోధన చేయడం కూడా కొత్తగా ఉందని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి శశాంక్ పేర్కొన్నాడు. చాలాచోట్ల భోజనం చేసేందుకు తగిన సమయం కూడా ఇవ్వడం లేదు. ఆటలు పూర్తిగా రద్దు చేశారు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌కే పరిమితం చేశారు. ఇంటికి ఫోన్ చేసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు ఆదివారం మాత్రమే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి.
ఆ చాప్టర్లంటే వణికి పోతున్నారు
కొన్ని చాప్టర్లు ఎంత చదివినా విద్యార్థులకు బోధపడటం లేదు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్‌గానే ఇప్పటివరకు చదివినట్టు విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ పోటీపరీక్షల కోసం భిన్నంగా చెబుతున్నారని వారు అంటున్నారు. గతంలో చదివింది ఇప్పుడు చదివే దానికి పొంతనే ఉండటం లేదంటున్నారు. మేథ్స్‌లో మ్యాట్రిక్స్ అండ్ డిటరి్మనేట్స్‌లో ఎడ్‌జాయింట్, ఇన్‌వర్స్, ప్రాపర్టీస్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్‌లో కొత్త విధానం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సి వస్తోందని ఇంటర్ విద్యార్థి సందీప్ చెప్పాడు. ప్రాబబులిటీ డిస్ట్రిబ్యూషన్స్‌లో నార్మల్ చాప్టర్స్‌ను ఇప్పుడు సుదీర్ఘంగా చేయాల్సి వస్తోందంటున్నారు.
సర్కిల్స్, పారా»ొలా, ఎల్లిప్స్, హైపర్‌బోలా, వెక్టర్ ఆల్జీబ్రాలో స్కాలర్ ప్రొడక్ట్, వెక్టర్ ప్రొడక్ట్ వంటివి సాధారణ సెక్షన్‌లో ఉండే విద్యార్థులకు అంతుబట్టడం లేదు. ఒక్కసారిగా వాటిని భిన్నమైన రీతిలో బోధించడమే అందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఎలక్రి్టక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్‌నేటింగ్ కరెంట్ వంటి చాప్టర్లలో కొత్త అంశాలను జాతీయ పరీక్షల కోసం అధ్యాపకులు చెబుతున్నారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయంటున్నారు. కెమెస్ట్రీలోనూ సెల్ పొటెన్షియల్స్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, మెకానిజం బేస్డ్ రియాక్షన్స్‌ను పాఠ్యపుస్తకంలో లేని కొత్త అంశాలతో పరీక్షల కోణంలో చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు.
ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యలు..
కొన్నేళ్లుగా ఇంటర్ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. బోధన సమయంలో ఒత్తిడి, ఫలితాలు తారుమారు కావడం, జాతీయ స్థాయిలో ర్యాంకులు వారిని కుంగదీస్తున్నాయి. 2019లో 22 మంది, 2022లో 543 మంది, 2024లో ఏడుగురు, 2025లో ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెడతామని.. ఒత్తిడి పెంచుతున్న కాలేజీల వివరాలు సేకరించాలని జిల్లా ఇంటర్ అధికారులను ఆదేశించినట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి.
విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించేలా బోధించాలని కాలేజీల యాజమాన్యాలు మాకు తేల్చిచెబుతున్నాయి. దీంతో విద్యార్థులపై మేం ఒత్తిడి పెంచక తప్పడం లేదు. కానీ దీనివల్ల దుష్ఫలితాలు ఎదురుకావచ్చు. – రణదీప్ పల్లవ్, ఇంటర్ అధ్యాపకుడు
ర్యాంకుల ఆందోళనలో విద్యార్థులు
నెల రోజుల వ్యవధిలో 10 మంది ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చా. మాకు ర్యాంకులు వస్తాయా? మేం ఏం చదవాలనే ఆందోళన వారిలో కనిపించింది. – సరితా వినీత్, మానసిక వైద్యురాలు


