ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి
వెల్లువెత్తిన అభ్యంతరాలతో నిర్ణయం?
సమగ్ర పరిశీలనానంతరమే ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) వార్డుల పునరి్వభజన (డీలిమిటేషన్)కు బ్రేక్ పడింది. డివిజన్ల పునరి్వభజన సహేతుకంగా లేదనే ఆరోపణల నేపథ్యంలో డీలిమిటేషన్ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. నగర శివార్లలోని 20 పురపాలికలు, ఏడు నగర పాలక సంస్థలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ 300 వార్డులు పునరి్వభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపో, మాపో విడుదల కాగలదనుకుంటున్న తరుణంలో తాజా పరిణామం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక నోటిఫికేషన్ ఈ నెల 9వ తేదీన జారీ కాగా, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 22వ తేదీ వరకు కూడా ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించారు. పునరి్వభజనపై దాదాపు 6వేల అభ్యంతరాలు, ఫిర్యాదులు అందాయి. వాటిల్లో అర్హత కలిగిన, సమంజసమైనవిగా భావించిన అన్నింటినీ పరిష్కరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, ముమ్మర కసరత్తుతో రేయింబవళ్లు పనిచేసి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ కావడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వారి ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ఎందుకో..?
వచ్చే సంవత్సరం జరగాల్సిన ఎస్‌ఐఆర్, జనగణనను దృష్టిలో ఉంచుకొని డీలిమిటేషన్‌ను త్వరితంగా పూర్తిచేయాలని పురపాలకశాఖ భావించింది. దానికి తగ్గట్టుగానే చకచకా డివిజన్లు, సర్కిళ్ల హద్దులకు ఈ నెలాఖరులోపు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించింది. పారీ్టలకతీతంగా అటు ప్రజాప్రతినిధుల నుంచి, ఇటు ప్రజల నుంచి కూడా కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులందడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అభ్యర్థనలు, తదితరమైన వాటి నేపథ్యంలో తుది నోటిఫికేషన్ వెలువరిస్తే, హడావుడిగా ముగించారని విమర్శలు వెల్లువెత్తుతాయనే అభిప్రాయంతో ప్రభుత్వం ప్రస్తుతానికి బ్రేకులు వేయాలని భావించినట్లు తెలిసింది. అధికారపార్టీ ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఈ అంశంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో డివిజన్ల పేర్లు, హద్దులు, కార్పొరేషన్ల విభజనపై అచితూచి అడుగువేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచి్చనట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలికి ఫిబ్రవరి పదోతేదీ వరకు గడువుండటాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తుది నివేదికకకు విరామమిచి్చనట్లు తెలుస్తోంది.
విలీనంపై వివరణివ్వండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో సమీప మున్సిపాలిటీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ జారీ చేసిన ఆర్డీనెన్స్‌లను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన బీ రాజు హైకోర్టులో మూడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఓటరు. వివాదాస్పదంగా విలీనం చేసిన మున్సిపాలిటీల్లో ఇది ఒకటి. పిటిషనర్ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థి అని.. విలీనం కారణంగా భూభాగ పరిధి, పాలన, స్వరూపం, జనాభా మార్పులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారు. ఆర్డినెన్స్ జారీకి ముందు తుక్కగూడ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరపాల్సి ఉంది. అలా చేయకుండా ఏకపక్షంగా విలీనం చేపట్టినందున ఆర్డినెన్స్ 9, 10, 11ల అమలును నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం–1955కు చేసిన సవరణలను ఆపి వేయాలి’అని కోరారు. కౌంటర్ దాఖలుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.


