సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు, చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీలలో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైంది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా రూ.10 నోట్లు కనుమరుగవుతున్నాయి.
నోట్లకు బదులు విడుదల చేసిన రూ.10 నాణేలు చెల్లుబాటు కావని పలు వదంతులు రావడంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసినట్లు తెలుస్తోంది. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్‌బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటున్నది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి.
ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణాల ముద్రణకే ఆర్‌బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో 10 నాణాలపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్‌బీఐ కచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 నాణాలను ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను సామాజిక మాధ్యాల ద్వారా పోస్టర్ల ద్వారా బ్యాంకుల్లో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత సంవత్సరం కొత్త రూ.10 నాణాలను ఆర్‌బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు.
రూ.10 స్టాంప్ పేపర్ల కొరత
విద్యార్థుల, సామాన్యుల అవసరాలలో ప్రాధాన్యత కలిగిన రూ.10 స్టాంప్ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇళ్లు, దుకాణాల కిరాయినామా లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా రూ.10 స్టాంప్ పేపర్ల పైనే జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్‌ల రెన్యూవల్స్, ఆదాయ, కుల ధృవీకరణాల పత్రాల కోసం ఈ స్టాంప్ పేపర్లనే వాడే వారు. కల్యాణలక్షి్మ, షాదీముబారక్ పథకాల లబి్ధదారులకు రూ.10 స్టాంప్ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.10 స్టాంప్‌లు లభించకపోవడంతో రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను వాడాల్సి వస్తోంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ గల స్టాంప్ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే రూ.10 స్టాంప్ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.
ఫ్రాంకింగ్ మెషిన్ల ద్వారా..
స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అధికారులు తెలిపారు. ఈ మెషిన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్ పేపర్లు అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు.


