సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యల చేయడాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పుబట్టారు. కేసీఆర్‌పై రేవంత్ మాట్లాడిని భాష సరికాదని వ్యాఖ్యలు చేశారు. దీంతో, బండి సంజయ్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘మనం మాట్లాడే భాష ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా ఉండకూడదు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌పై మాట్లాడిన భాష సరికాదు. సీఎం రేవంత్ తన భాషపై పునరాలోచన చేయాలి. రేవంత్ భాషతో ఆయనకే నష్టం జరుగుతుంది. ప్రతీ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని హిందూ ధర్మం కోరుకుంటుంది అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో కృష్ణా జలాలపై స్పందిస్తూ..‘కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నది కేసీఆర్. ఆ విషయాన్ని బయట పెట్టింది నేను. ముడుపుల కోసం కేసీఆర్ 575 టీఎంసీలు కావాలని అడగలేదు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు. కాళేశ్వరం దృష్టి మళ్లించడానికి కృష్ణా జలాలు అంశం కేసీఆర్ లేవనెత్తుతున్నారు. తెలంగాణకు కేసీఆర్ ద్రోహి. ఇందుకే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఏం సరిపోతాయి. ప్రతీ గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు ఇవ్వాలి. మార్చి నాటికి మూడువేల కోట్లు ఇస్తామని రేవంత్ అంటున్నారు.. అవి కేంద్రం ఇచ్చే నిధులే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మంత్రులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. భూములు కొల్లగొడుతున్న ఇద్దరు, ముగ్గురు మంత్రులు భవిష్యత్‌లో జైలుకు వెళ్లడం ఖాయం. వారిపై నివేదిక తయారు చేస్తున్నాం.
గెలిస్తే కాంగ్రెస్ పార్టీనా?
పార్టీ గుర్తుపై జరిగే MPTC, ZPTC ఎన్నికలకు వెళ్లకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళను తమ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక ఫిరాయింపు ఎమ్మెల్యే బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినా స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నిజాయితీ పరులు.. వారికి స్వేచ్ఛ ఇవ్వండి. మావోయిస్టుల లిస్టులో పెట్టి మా ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు ఆధారాలు లేవు’ అని కామెంట్స్ చేశారు.
బీజేపీ బలంగానే ఉంది..
మా పార్టీ నేతలమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మేం కలిసి భోజనాలు కూడా చేశాం. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం జీవోలను దాచిపెడుతోంది. ఆరు గ్యారెంటీలు చర్చ జరగకుండా చేస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన కింద ఎన్ని ఇళ్లు ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో నలుగురు రోహింగ్యాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఓట్ల కోసం వారిని ప్రోత్సహిస్తున్నారు. భాగ్యనగరం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ మేయర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. గతంలో కొద్ది తేడాలో మేయర్ స్థానం పోగొట్టుకున్నాం. ఈసారి సింగిల్‌గా మేయర్ పీఠం మాదే. ఎంఐఎంకు అనుకూలంగా హైదరాబాద్‌లో డివిజన్ల డీలిమిటేషన్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మాయలో ఉంది. భాగ్యనగరంలో ఎంఐఎంతో సహవాసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరూ వేయడానికి సాహసం చేయరు. జూబ్లీహిల్స్ ఓటమితో కార్యకర్తలు ఆవేదన చెందారు. ఖైరతాబాద్‌లో కార్యకర్తలు కసితో ఉన్నారు. ఈ దేశంలో మైనార్టీ ప్రజలంతా క్షేమంగా ఉన్నారు. ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో మాత్రం హిందువులను హతమారుస్తున్నారు’ అని అన్నారు.


